కరోనా.. చివరకు చాయ్‌పత్తాను కూడా వదల్లేదు

by  |
కరోనా.. చివరకు చాయ్‌పత్తాను కూడా వదల్లేదు
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా భూతం నిత్యావసర వస్తువులపైనా ప్రభావం చూపిస్తోంది. ధరలకు వైరస్ సోకుతోంది. ముడి సరుకుల దిగుమతి తగ్గడంతో పాటు ఉత్పాదక శక్తి అంతరించిపోతోంది. తాజాగా చాయ్ పత్తాపైనా పడింది. నాణ్యతను బట్టి కిలోకు రూ.40 నుంచి రూ.100 వరకు ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా వైరస్, లాక్‌డౌన్ అమలు వంటి కారణాలతో హోటళ్లు చాలా వరకు మూత పడ్దాయి. ఇప్పుడెవరూ హోటళ్లలో కూర్చొని చాయ్ తాగుతూ కాలక్షేపం చేసేవాళ్లు కనిపించడం లేదు. ఆ సంఖ్య 90 శాతం పడిపోయింది. ఎవరింట్లో వాళ్లు చాయ్ తాగుతున్నారు. కానీ దోస్తులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఒకటీ రెండు సార్లు టీ తాగే వెసులుబాటు, అవకాశం లేకుండాపోయింది. ఏ ఇద్దరినీ కలవనీయకుండా చేయడంతో చాయ్ హోటళ్లలో గిరాకీ పడిపోయింది. అదే క్రమంలో టీ పొడి అమ్మకాలు పడిపోయాయి. దానికి తోడు కంపెనీల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయి. ఖుల్లా అమ్మేవారితో పాటు ప్యాకెట్లు, బ్రాండెడ్ చాయ్ పత్తా దుకాణాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ లో చాయ్ పత్తా డీలర్ల సంఖ్యనే 170 వరకు ఉంది. తెలంగాణలో చాయ్ లేకుండా దినం గడవదు. పొద్దున్నే ఓ కప్ కాఫీయో, చాయో కడుపులో పడంది ఉండలేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఐతే మార్చి నుంచి కరోనా వైరస్ తీవ్రమవుతోంది. అదే క్రమంలో సోషల్ మీడియాలో వైరస్ నియంత్రణకు చాయ్ తాగొచ్చునంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే ఇండ్లల్లో చాయ్ పత్తా వినియోగం పెరిగింది. కానీ హోటళ్లు మూతపడడంతో ఆ స్థాయిలో అమ్మకాలేం పెరగలేదని డీలర్లు చెబుతున్నారు. హోటల్‌లో దోస్తులతో కూర్చుంటే ఒకటీ, రెండు, మూడు.. తాగేవాళ్లున్నారు. పైగా ఎక్కువ మంది వినియోగిస్తారు. అదే ఇండ్లల్లోనైతే ఆ స్థాయిలో చాయ్ పత్తాను వేసి టీ తయారు చేయరంటున్నారు. ఇప్పుడీ ఉత్పత్తి తగ్గడంతో ధరల పెంపు అనివార్యంగా మారిందన్నారు.

ప్రతికూల వాతావరణం

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు తోడు అసోం, ఇతర తేయాకు పండే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం వల్ల తేయాకు దిగుబడి భారీగా తగ్గిందని టీ వ్యాపారుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు హమీదుద్దీన్ షాహెద్ శనివారం ‘దిశ’కు తెలిపారు. గౌహతి, కోల్‌కతా, కన్నూర్ వంటి తేయాకు కేంద్రాల్లో టీపొడి ధరలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే రూ.40 నుంచి రూ.80 వరకు తేయాకు ధరలు పెరిగాయి. తేయాకు పంట దిగుబడి తగ్గడంతో టీపొడి కేంద్రాల వారు రేట్లను పెంచడం వల్ల హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రాంతాల్లో టీపొడి ధరలు పెంచక తప్పలేదన్నారు. ప్రజలు, కిరాణా దుకాణదారులు, హోటల్ వ్యాపారులు అర్థం చేసుకోవాలని కోరారు. గతంలో రూ.300 కిలో ఉంటే ఇప్పుడది రూ.380 కి చేరిందన్నారు. నాణ్యత, బ్రాండ్లను బట్టి ధరలు పెరిగినట్లు వివరించారు. కరోనా వైరస్ వల్ల హోటళ్లు మూతపడడంతో తమ వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తరతరాలుగా ఈ వ్యాపారంలోనే ఉన్నామన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మునుపెన్నడూ రాలేదన్నారు. ఆఖరికి కరోనా వైరస్ చాయ్ పత్తా మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు.

Next Story

Most Viewed