హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన

by  |
హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక్కడి ప‌రిస్థితుల‌ను కేంద్ర బృందం అధ్యయ‌నం చేస్తోంది. జ‌ల‌శ‌క్తి శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అరుణ్ భ‌రోక నేతృత్వంలో కేంద్ర అంత‌ర్ మంత్రిత్వ శాఖ‌ల అధికారులు ఆదివారం నగరంలో పర్యటించారు. ఈ బృందంలో కేంద్ర ప్ర‌జారోగ్య‌శాఖ సీనియ‌ర్ వైద్యులు చంద్ర‌శేఖ‌ర్ గెడం, జాతీయ పోష‌కాహ‌ర సంస్థ డైరెక్ట‌ర్ హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేది ఉన్నారు. పర్యటనలో భాగంగా మెహిదీప‌ట్నం రైతుబ‌జార్‌ను సందర్శించిన కేంద్రం బృందం ప్రతినిధులు కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు విక్ర‌యిస్తున్న రైతుల‌తో మాట్లాడారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూర‌గాయ‌లు, ఆకు కూర‌లు, పండ్ల‌ను అందుబాటులో ఉంచేందుకు 120 మొబైల్ రైతు బ‌జార్లను ఏర్పాటు చేసిన‌ట్లు ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావిణ్య ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. అనంత‌రం నేచ‌ర్ క్యూర్ హాస్పిట‌ల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ క్వారంటైన్‌ను తనిఖీ చేసిన కేంద్ర బృందం ప్రతినిధులు.. వైద్యులు, న‌ర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు. క్వారంటైన్‌లో ఉంచిన వ్య‌క్తుల‌కు వైద్య ప్ర‌మాణాల ప్ర‌కారం పోష‌కాహారాన్ని అందించిన‌ట్లు హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేత‌మ‌హంతి వివ‌రించారు. ప్ర‌స్తుతం నేచ‌ర్ క్యూర్ హాస్పిట‌ల్‌లో క్వారంటైన్‌లో ఎవ‌రూలేర‌ని తెలిపారు. అనంతరం శాంపిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను కేంద్ర బృందం తనిఖీ చేసింది. వైద్యులు, న‌ర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియ‌న్లు తీసుకుంటున్న చొర‌వను, జాగ్ర‌త్త‌ల‌ను జ‌ల‌శ‌క్తి శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అరుణ్ భ‌రోక అభినందించారు.

అటు.. మ‌ల‌క్‌పేట్ కంటైన్‌మెంట్ జోన్‌ను త‌నిఖీ చేసిన కేంద్ర బృందం బారీకేడింగ్‌ను పరిశీలించింది. కంటైన్‌మెంట్ జోన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఎమ‌ర్జెన్సీ సేవ‌ల బృందం, వైద్య బృందంతో చ‌ర్చించింది. కంటైన్‌మెంట్‌లో ఉన్న ఇళ్ల నుండి ఎవ‌రిని బ‌య‌ట‌కు అనుమ‌తించ‌డంలేద‌ని, వారికి కావాల్సిన వ‌స్తువుల‌ను తెలుసుకొని ప‌క్క‌నే ఉన్న సూప‌ర్ మార్కెట్ నుండి తెచ్చి ఇస్తున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కంటైన్‌మెంట్ జోన్ లోప‌లికి వెళ్లి నిబంధ‌న‌ల అమ‌లును ప‌రిశీలించారు. కేంద్ర బృందంతో పాటు జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఎన్‌.ర‌వికిర‌ణ్‌, సామ్రాట్ అశోక్ ఉన్నారు.

tags: Lockdown, hyderabad, Central Team, Tour, GHMC, Nature cure, corona, malakpet, Rythu Bazar

Next Story

Most Viewed