కేంద్ర విధానాలు ఫెడరల్ స్పూర్తికి విరుద్దం: టీటీడీపీ దుర్గాప్రసాద్

by  |
కేంద్ర విధానాలు ఫెడరల్ స్పూర్తికి విరుద్దం: టీటీడీపీ దుర్గాప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం పెత్తనాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించాల్సింది పోయి మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కేంద్రం యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇది ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ధ్వజమెత్తారు. సోమవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల చేతగానితనం వల్లే కేంద్రం నీటి పారుదల ప్రాజెక్టులపై కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. ఆ నీళ్లపై ఢిల్లీ నుంచి పెత్తనం చేయాలనే నిర్ణయం విడ్డూరంగా ఉందన్నారు. నీళ్ల కోసం రెండు రాష్ట్రాల రైతులు కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూడాలా..? ఇది ఒకరకంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడమేనన్నారు.

కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రకారం వాటాలు పంచాల్సిన అవసరం ఉందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా అదే చెప్పిందన్నారు. గోదావరి జలాలతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని గతంలో ఇద్దరు సీఎంలు గొప్పలు చెప్పి ఇప్పుడు రాష్ట్రాల నీటి హక్కులను కేంద్రం బోర్డుల పరం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేంద్రం గెజిట్ ఇచ్చేదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడేదో కళ్లు తెరిచినట్లుగా కేసీఆర్ ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతాంగానికి నష్టం జరగకుండా టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని, నీటి పై కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రైతాంగానికి ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed