తుఫాన్ ప్రమాదం.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

by  |
cyclone
X

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 24లోగా తుఫాన్‌గా పరిణమించే ముప్పు ఉన్నది. 26వ తేదీలోగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలను తాకనుంది. అతివేగంతో వీచే గాలులు, భీకర వర్షం కలుపుకుని ఈ తుఫాన్(యాస్) విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులను అలర్ట్ చేసింది. ఇప్పటికే కరోనా మహమ్మారితో వైద్యారోగ్య వ్యవస్థ దాని సామర్థ్యాల అంచుకు చేరుకుంది. ఈ తుఫాన్ కారణంగా ఆ వ్యవస్థపై ఒత్తిడి రాకుండా, లేదా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా ఆ ఫెసిటీల్లోని పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు, ప్రణాళికలు వేసుకోవాలని సూచించింది. అంతేకాదు, ప్రస్తుతం కరోనా విసురుతున్న సవాల్‌కు తోడు వర్షాలు, తుఫాన్‌ కారణంగా ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదేశించారు. తద్వారా ఆరోగ్య వ్యవస్థపై పెనుభారాన్ని తప్పించినవారమవుతామని తెలిపారు. ఇందుకోసం తుఫాన్ ప్రభావాన్ని ఆరోగ్య వ్యవస్థపై తగ్గించడానికి పలు సూచనలు చేశారు.

ప్రభుత్వాలు హెల్త్ సెక్టార్ ఇన్సిడెంట్ కమాండ్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లేదా వార్ రూమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని, ఒక నోడల్ అధికారిని గుర్తించి ఆయన కాంటాక్ట్ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు అందజేయాలని భూషణ్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోని అన్ని తీరప్రాంత జిల్లాల్లో హెల్త్ సెక్టార్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్, హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ యాక్టివేట్ చేయాలని వివరించారు. తుఫాన్‌తో ముందుగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని హెల్త్ ఫెసిలిటీలోని పేషెంట్లను సురక్షిత ప్రాంత హాస్పిటళ్లకు మార్చడానికి ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో తుఫాన్ కారణంగా ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్‌తో ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని అన్ని రకాల హాస్పిటళ్లలో అదనపు సిబ్బందిని చేర్చాలి. తుఫాన్‌ ప్రభావం పెద్దగా లేని ప్రాంతాల హాస్పిటళ్ల నుంచి వీరిని ఇక్కడికి బదిలీ చేయాలి. అన్నిరకాల ఔషధాలు, ఎక్విప్‌మెంట్లు ముందస్తుగా సమకూర్చుకోవాలి. ముఖ్యంగా పవర్ బ్యాకప్‌లనూ ఏర్పాటు చేసుకోవాలి. ఆక్సిజన్ ట్యాంకర్లు సజావుగా ప్రణాళిక ప్రకారం చేరుకోవడానికి ముందస్తు ప్లాన్స్ వేయాలి. అవసరమైతే ఎయిర్‌ఫోర్స్, రైల్వేల ద్వారా ఖాళీ ట్యాంకర్లను తరలించాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా అంబులెన్స్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతాల్లో వేగంగా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించారు.



Next Story