మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు

by  |
మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు
X

– మే 17 వరకు దేశవ్యాప్తంగా
– తెలంగాణలో మే 7 వరకు యథాతథం
– కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ

దిశ, న్యూస్ బ్యూరో : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించింది. ఈ మేరకు మే నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ నెల 3వ తేదీతో రెండో విడత లాక్‌డౌన్ ముగుస్తున్న సమయంలో ఈ పొడిగింపు నిర్ణయం వెలువడింది. అయితే ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులన్నీ యథావిధిగా వర్తించనున్నాయి. వీటికి తోడు మరికొన్ని సడలింపులను కూడా చేర్చారు. వైరస్ తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా జిల్లాలను విభజించి ఏయే జోన్‌లో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఉందో మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించడానికి సంబంధించి ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి శనివారం ఉదయం ప్రసంగించనున్నారు. ప్రధాని అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రుల సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ క్లస్టర్లలో, వెలుపల ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఉందో మార్గదర్శకాల్లో పేర్కొంది. కానీ తెలంగాణలో ఈ నెల 7 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుకానుంది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలోనూ కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనుంది.

కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. గ్రీన్ జోన్లలో నిర్దిష్టంగా కొన్ని కార్యకలాపాలు మినహా వ్యక్తిగత వాహనాలు, క్యాబ్ సర్వీసులు, ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. జిల్లాల మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో 50% మాత్రమే ప్రయాణీకులు ఉండాలి. ఆర్టీసీ డిపోలు సైతం 50% మేర సర్వీసులను మాత్రమే నడపాలి. కార్లలో డ్రైవర్ కాకుండా ఇద్దరికే అనుమతి. మద్యం, పాన్ దుకాణాలు కూడా తెరుచుకోవచ్చు. కానీ ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకేసారి గుమికూడరాదు. వ్యక్తుల మధ్య ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. కానీ బహిరంగంగా మద్యం సేవించడం, సిగరెట్ తాగడం, గుట్కా తినడం నిషేధం. యాభై మందికి మించకుండా వివాహాలు కూడా జరగొచ్చు. స్కూళ్ళు, కోచింగ్ సంస్థలు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, బార్లు, ఆడిటోరియంలు, సినిమాహాళ్ళు, రైళ్ళు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, మెట్రో రైళ్ళు, ఇతర రాష్ట్రాలకు ప్రయాణం, హోటళ్ళు తదితరాలన్నీ నిషేధం. అన్ని రకాల ముడిసరుకులు, వస్తువులు తీసుకెళ్ళే గూడ్సు వాహనాలకు పూర్తి అనుమతి ఉంటుంది. దేశవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ/144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఏ జోన్‌లోనైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో, క్లినిక్‌లలో ఔట్ పేషెంట్ సేవలు కొనసాగించుకోవచ్చు. కానీ కంటైన్‌మెంట్ జోన్లలో నిషేధం ఉంటుంది.

దేశమంతా రేపటి నుంచే.. తెలంగాణలో 8 నుంచి !

కేంద్ర హోంశాఖ లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు ఇచ్చిన మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఈ సడలింపులపై ఈ నెల 7వ తేదీ వరకు నిషేధం ఉంది. మంత్రివర్గం ఈ నెల 5న సమావేశమై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఏ మేరకు సడలింపులు, అనుమతులు ఉంటాయనేదానిపై స్పష్టత వస్తుంది. గత నెల 20 నుంచి దేశమంతా సడలింపులు అమల్లోకి వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం 7వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పుడు లాక్‌డౌన్ మరో రెండు వారాలు కొనసాగుతున్నా కొన్ని సడలింపులు వచ్చినందున అందులో ఏవి ఏ మేరకు రాష్ట్రంలో అమల్లోకి వస్తాయనేది 5వ తేదీ రాత్రికి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. అప్పటివరకూ ప్రస్తుతం కొనసాగుతున్న పూర్తిస్థాయి లాక్‌డౌన్ యధాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉండగా, 18 ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తే కొన్ని ఆరెంజ్ జోన్‌లు గ్రీన్ జోన్‌లోకి వస్తాయి.

లాక్‌డౌన్‌లో ఇవి నిషేధం :

– అంతర్జాతీయ, డొమెస్టిక్ విమాన సర్వీసులు. అత్యవసరమైన ఎయిర్ ఆంబులెన్స్‌లకు అనుమతి ఉంటుంది.
– రైలు సర్వీసులపై నిషేధం. హోంశాఖ అనుమతి ఉంటే ఓకే.
– అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు
– మెట్రో రైలు సర్వీసులు
– అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం.వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేదు.ప్రత్యేక అనుమతి ఉంటే ఓకే.
– స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ట్రెయినింగ్ సంస్థలు తెరవడం నిషేధం. కానీ ఆన్‌లైన్, డిస్టాన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లకు అనుమతి ఉంది.
– హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్ళు, స్విమింగ్ పూల్స్, జిమ్‌‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు.. నిషేధం.
– సామాజిక, రాజకీయ, స్పోర్ట్స్, వినోద, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, జనం గుమికూడే కార్యక్రమాలు నిషేధం.
– అన్ని మతాల ప్రార్థనాస్థలాలు తెరవడం నిషేధం. అక్కడ జనం గుమికూడడం నిషేధం.
– రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటోరిక్షాలు, టాక్సీలు, క్యాబ్ సర్వీసులు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, బార్బర్ సెలూన్‌లు, బ్యూటీ పార్లర్లకు అనుమతి లేదు.

రెడ్ జోన్లలో అనుమతి ఉండేవి :

రెడ్ జోన్లుగా పరిగణిస్తున్న జిల్లాలు, ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ లోపల, వెలుపల వేర్వేరు ఆంక్షలను హోంశాఖ నిర్దేశించింది. కంటైన్‌మెంట్ జోన్ల లోపల ఇప్పుడున్నట్లుగానే యథావిధిగా పూర్తిస్థాయిలో ప్రజల కదలికలపై నిషేధం ఉంటుంది. అత్యవసరమైన సర్వీసులకు మాత్రమే అనుమతి. కానీ రెడ్ జోన్ ప్రాంతమే అయినా అక్కడ కొన్ని పాకెట్లలో కంటైన్‌మెంట్ జోన్లు లేనట్లయితే అక్కడ కొన్ని పరిమితులతో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అనుమతి ఉన్న కార్యకలాపాలు
– స్థానిక పోలీసులు లేదా అధికారుల నుంచి అనుమతి ఉన్న వ్యక్తిగత వాహనాలు తిరగవచ్చు. అనుమతి ఉన్నట్లయితే కార్ల విషయంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి అనుమతి. బైక్ అయితే కేవలం నడిపే వ్యక్తి మాత్రమే. వెనక ఎవ్వరూ కూర్చుని ప్రయాణించడానికి వీలు లేదు.
– స్పెషల్ ఎకనమిక్ జోన్లు, పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, ఉత్పత్తి ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, ఐటీ హార్డ్‌వేర్ తయారీ పరిశ్రమలు, జనపనార పరిశ్రమలు.. ఇలాంటివి పనిచేయవచ్చు.
– పట్టణ ప్రాంతాలైనట్లయితే కార్మికులకు అక్కడే క్యాంపులు ఉంటే నిర్మాణ కార్యకలాపాలు జరగవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చేటట్లయితే నిషేధం. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నిర్మాణ పనులూ జరగవచ్చు.
– నిత్యావసర వస్తువులు అమ్మే మార్కెట్ కాంప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా ఉండే దుకాణాలు కూడా తెరుచుకోవచ్చు. నిత్యావసర వస్తువులకు మాత్రమే ఈ-కామర్స్ (ఆన్‌లైన్) ఆర్డర్లు ఇవ్వవచ్చు.
– ప్రైవేటు ఆఫీసులు 33% మంది స్టాఫ్‌తో నడవవచ్చు. మిగిలినవారు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేయాలి.
– అన్ని ప్రభుత్వ కార్యాలయాలు డిప్యూటీ కార్యదర్శికంటే పై స్థాయి పోస్టులైతే 100% హాజరుకావాలి. కింది స్థాయి ఉద్యోగులు మాత్రం 33% మేరకు మాత్రమే హాజరుకావాలి. పోలీసు, ప్రజారోగ్యం, డిఫెన్స్, జైళ్ళు లాంటి అత్యవసర సేవలకు మాత్రం ఇది మినహాయింపు.

ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాలు :

దేశవ్యాప్తంగా నిషేధించబడిన కార్యకలాపాలు తప్ప మిగిలినవాటన్నింటికీ అనుమతి ఉందని హోంశాఖ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అయితే కొన్నింటికి పరిమితులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లోని కార్యకలాపాల వివరాలు ఇవి…
– ఆరెంజ్ జోన్లలో జిల్లాల మధ్య బస్సు సర్వీసులు నిషేధం.
– జిల్లా లోపల మాత్రం బస్సు సర్వీసులు 50% ప్రయాణీకులతో నడుస్తాయి.
– టాక్సీలు, క్యాబ్ సర్వీసులు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణీకులకు అనుమతి. జిల్లా పరిధి దాటి వెళ్ళాల్సి వస్తే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

గ్రీన్ జోన్లలో కార్యకలాపాలు :

– నిషేధించబడినవి తప్ప మిగిలిన కార్యకలాపాలన్నీ యథావిధిగా చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. బస్సులు 50% నడవవచ్చు.
– రాష్ట్రాల మధ్య గూడ్సు వాహనాలకు పూర్తిస్థాయిలో అనుమతి
– బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రతీ ఒక్కరు విధిగా మాస్కు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
– యాభై మందికి పైగా జనం పోగవకుండా వివాహాలు జరగవచ్చు. అంతిమయాత్రలైతే ఇరవై మందికి మించరాదు.
– మద్యం దుకాణాలు, పాన్ దుకాణాలు తెరుచుకోవచ్చు. కానీ ఒకేసారి ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదు. వ్యక్తుల మధ్య ఆరు అడుగుల దూరం నిబంధనను పాటించాలి.
– వృద్ధులు, చిన్నపిల్లలు వైద్యం లాంటి అవసరాలు ఉంటేనే బయటకు రావాలి. లేదంటే ఇళ్ళకే పరిమితం కావాలి.
– పని స్థలాల్లో శానిటైజర్లు, సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి. ఉద్యోగులు విధిగా ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
– రాత్రి 7 గంటల మొదలు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ/144 సెక్షన్ అమలులో ఉంటాయి. అత్యవసర పనులమీద తిరిగే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
– బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలకు చెందిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చు.

Tags : India, Corona, LockDown, Extenstion, Restrictions, Red, Orange, GreenZones, Wines

Next Story

Most Viewed