సెంట్రల్ కేబినెట్ విస్తరణ.. ఎంపీ సోయం బాపురావుకు చాన్స్..?

by  |
pm-modi-cabinet
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నివాసంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ తన మంత్రివర్గం పనితీరుపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి కసరత్తు పూర్తికాగా, మిగతా 28 మందిని త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే మీటింగ్‌లో మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఈరోజు సాయంత్రం లేదా రేపు కేబినెట్ మార్పునకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

ఇదిలాఉండగా, ఈసారి కొత్తగా 28 మందికి కేంద్ర మంత్రివర్గంలో ప్లేస్ దక్కనున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, యువ నాయకులకు మోడీ తన కేబినెట్‌లో చోటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో లల్లన్ సింగ్, అనుప్రియ పటేల్, అనిల్ జైన్, సంతోష్ కుష్వాహ, జ్యోతిరాధిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, వరుణ్ గాంధీ, భూపేందర్ యాదవ్, రిటా బహుగుణ జోషి, రాంశంకర్ కథేరియా, పశుపతి పరాస్, సుశీల్ కుమార్ మోదీ, రామ్‌నాథ్ ఠాకూర్‌తో పాటుగా తెలంగాణ నుంచి ఎంపీ సోయంబాపురావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతుండగా, మరోసారి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కేంద్రమంత్రిగా అవకాశం దక్కుతుందో లేదో వేచిచూడాల్సిందే.



Next Story