కరోనాపై సీసీఎంబీ కీలక వ్యాఖ్యలు..

by  |
కరోనాపై సీసీఎంబీ కీలక వ్యాఖ్యలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కరోనా వైరస్‌తో వచ్చిన యాంటీబాడీస్‌ని గుర్తించినట్టు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈరోజు తార్నాకలోని సీసీఎంబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో 30 వార్డుల నుంచి దాదాపు 9 వేల మంది నమూనాలను సేకరించి యాంటీబాడీస్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించామన్నారు. పదేండ్ల నుంచి 90 ఏళ్ల వయసుగల వారిని ఈ పరీక్షలకు ఎంపిక చేశామన్నారు.

సీఎస్ఐఆర్, సీసీఎంబీ, ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్ సంస్థలు ప్రజల్లో కరోనా వైరస్‌తో వచ్చిన యాంటీబాడీస్‌ని అంచనా వేశాయన్నారు. దాదాపు 54% ప్రజల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ తయారు అవడంతో వీరందరికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. స్త్రీలలో ఎక్కువగా 56 శాతం మందికి, పురుషులలో 53 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారిలో 43 శాతం మాత్రమే యాండీబాడీలు నమోదు అయినట్టు వివరించారు. వైరస్ సోకిన కుటుంబాలలో 78 శాతం మందికి యాండీబాడీలు వృద్ధి చెందినట్టుగా గుర్తించామన్నారు. చిన్న కుటుంబంలో ఉన్న వారికి కరోనా వైరస్ తక్కువగా వ్యాపించినట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో 75 శాతం మందికి కరోనా సోకినట్టు కూడా వారికి తెలియలేదన్నారు. కరోనా సోకిన వారికి, సోకని వారిలోనూ ఒకేరకమైన సీరోపాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిసిందని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న టీకా వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో వ్యాధి సోకినవారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. అయితే కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కొవిడ్ నింబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఎంబీ సీఈవో లక్ష్మయ్య, డాక్టర్ మధుసూధన్ రావు, కృష్ణ మోహన్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed