ఖరీదైన గాడ్జెట్స్… ఇక్కడ ఫ్రీ గురూ.. !

by  |
ఖరీదైన గాడ్జెట్స్… ఇక్కడ ఫ్రీ గురూ.. !
X

దిశ, తెలంగాణ బ్యూరో : రూ. 76,900 విలువైన ఐఫోన్ 6ఎస్ ఫ్లస్ ఫ్రీగా పొందాలనుకుంటున్నారా… లేక రూ. లక్ష విలువైన ఆపిల్ మ్యాక్ బుక్ ప్రోను ఉచితంగా మీతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీరు ఒక్కసారి జీహెచ్ఎంసీలో డ్యూటీ చేయాల్సిందే.. ఇవే కాదు.. మీకు నచ్చిన మోడల్స్‌లో ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీలు.. ఇలా ఏదైనా పూర్తి ఉచితంగా అనుభవించాలంటే మీరు బల్దియాలో అధికారులై ఉండాల్సిందే.. బదిలీ అయినపుడు మీతో పాటు కొన్నింటిని తీసుకెళ్లొచ్చు కూడా… (నిబంధనల ప్రకారం అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది..) ఏదో చిన్నా చితకా ఆఫీసర్ అయితే అడుగుతారు కానీ.. ఐఏఎస్‌లు, అసిస్టెంట్ కమిషనర్లను ప్రశ్నించేవారు, అప్పగించాలని నిలదీసేవారెవరూ ఉండరు కదా.. అలా ఆలోచించిన కొందరు ఐఏఎస్, సీనియర్ అధికారులు బల్దియా ఖాతా నుంచి కొనుగోళ్లు చేసిన ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అప్పగించకుండానే వెళ్లిపోయారు.

వారి స్థానంలో కొత్తగా వచ్చిన వారికి అదే స్థాయిలో మళ్లీ కొనుగోళ్లు చేసేందుకు ప్రజలపై పన్నుల భారం తప్పడం లేదు. అదీ కాదంటే రుణాల బాట ఎలాగో ఉంది. జీహెచ్ఎంసీలోని సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండగా.. మరో వైపు బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు తమకేం సంబంధం లేనట్టు రాయల్ లైఫ్ అనుభవాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. డ్యూటీలను అద్భతంగా చేసేందుకు టెక్నాలజీ, ఆధునికత కలగలిసినా గాడ్జెట్స్ వాడుతున్నారనుకున్నా.. బల్దియా నుంచి బదిలీ అయినా తర్వాత కూడా వాటిని వెంటతీసుకెళ్తున్నారు.

రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వస్తువులను అప్పగించాలని ఐఏఎస్‌లను అడిగే ధైర్యం బల్దియాలోని ఏ అధికారికి ఉంటుంది. ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు తమ టేబుళ్లపై ప్రదర్శిస్తూ కార్పొరేట్ ఆఫీసులను తలదన్నెలా వ్యవహరించినా.. బల్దియాను అప్పులతో నెట్టుకొస్తుండటం బహిరంగ రహస్యమే. తమ పని అయిపోయాక కనీసం జీహెచ్ఎంసీకి గాడ్జెట్స్ అప్పగిస్తే ఆ మేరకు భారమైనా తప్పుతుంది. కానీ కొందరు సీనియర్ అధికారులు ఇవేవీ తమకు పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇందులో ఐఏఎస్, అసిస్టెంట్ కమిషనర్లు ఉండటంతో ప్రజలపై ఎలాంటి భారాలు పడితే ఏంటీ. జీహెచ్ఎంసీ అప్పులు చేస్తే మాకేంటీ.. తాము కావాల్సిందే చేస్తామన్నట్టు బల్దియా ఉన్నతాధికారుల వ్యవహారం కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీలో కొత్తగా అడుగుపెట్టారంటే చాలు.. ప్రతీ అడిషనల్ కమిషనర్ తమ కార్యాలయాన్ని రినోవేట్ చేయడం ఓ తంతుగా మారిపోయింది. ఆఫీసులోని పాత ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానంలో కొత్తవి రావాల్సిందే.. ఖరీదైన పెద్ద టీవి, డెస్క్‌టాప్ లేదా ఆపిల్ మాక్ బుక్ ప్రో, ఆపిల్ ఫోన్లు లేదా మార్కెట్‌లో ఇతర ఖరీదైన మొబైల్స్ తమకు నచ్చిన బ్రాండ్స్‌ల్లో నుంచి వచ్చేస్తాయి. కనీసం ఐదు నుంచి పది లక్షల ఖర్చు పెట్టనిదే అధికారులు కొత్త ఆఫీసుల్లో అడుగుకూడా పెట్టడం లేదంటే అతిశయోక్తి కాదు. సదరు అధికారి ఉద్యోగంలో ఉన్నంత కాలం వాటితో పని చేసినా.. చేయకపోయినా.. బదిలీ అయినపుడు వాటిని జీహెచ్ఎంసీ అప్పగించాల్సిందే.. అయితే కొందరు అధికారులు వీటిని అప్పగించేందుకు రాలేదు.. ఐటీ విభాగం అధికారుల నుంచి వస్తువులను తీసుకోలేదు.

ప్రస్తుత జలమండలి ఎండీ దాన కిషోర్ జిహెచ్ఎంసి కమిషనర్‌గా చేసినపుడు శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9ను రూ. 89,999 కోనుగోలు చేశారు. ఆయన బదిలీ అయి వెళ్లినా కూడా ఇప్పటికీ ఆ ఫోన్ జీహెచ్ఎంసీకి చేరలేదు. జీహెచ్ఎంసీలో పనిచేసిన మరో ఐఏఎస్ అధికారి ప్రద్యూమ్న కోసం ఆపిల్ ఐపాడ్ రూ.64, 900తో కోనుగోలు చేశారు. ఐఏఎస్ శివకుమార్ నాయుడు కోసం ఆపిల్ మ్యాక్ బుక్ 99,900తోనూ, రూ.76,900 విలువైన ఐఫోన్ కొనుగోలు చేశారు. ఈ రెండు కూడా బల్దియాకు అప్పగించకుండానే ఆయన మరో చోట డ్యూటీ చేస్తున్నారు. ఐఏఎస్ సిక్తాపట్నాయక్ రూ.93,750 విలువైన ఐఫోన్ 10 వర్షన్, ఆపిల్ మ్యాక్ బుక్ రూ.81,800లతో కోనుగోలు చేశారు. అడిషనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఐఫోన్ -10 కోసం రూ.93,750, ఆపిల్ మ్యాక్ బుక్ రూ.81,800 లతో కొనుగోలు చేశారు.
ఐఏఎస్‌లు అహ్మద్ బాబు, కిషన్‌ల కోసం వేర్వేరుగా రెండ ఆపిల్ మ్యాక్

బుక్‌లను రూ. 84, 900తో కొనుగోలు చేశారు. ఐఏఎస్ అద్వైత్ కుమార్ సింగ్ శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ను రూ.27,499 కొనుగోలు చేసి అధికారులకు అప్పగించారు. అయితే ఏ అధికారి కూడా ఖరీదైన గాడ్జెట్లను తిరిగి బల్దియాకు అప్పగించలేదు. బల్దియాలో పనిచేసి కేంద్ర సర్వీస్‌కు బదిలీ అయిన అమ్రపాలి రూ. 23, 900తో శామ్‌సంగ్ ఫోన్, ప్రస్తుత మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి రూ.93, 700 విలువైన ఆపిల్ ఫోన్ తోపాటు రూ.81,800 విలువైన ఆపిల్ మాక్‌బుక్ ప్రోను కొనుగోలు చేశారు. అయితే వాటిని తిరిగి జిహెచ్ఎంసికి అప్పగించలేదు. ఇక జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ముషారఫ్ అలీ కోసం అందరి కంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసినట్టు కనిపిస్తోంది. ముషారఫ్ అలీ కోసం ఆఫిల్ ఐఫోన్, ఆపిల్ మ్యాక్‌బుక్‌తోపాటు రెండు ఇతర కంపెనీల ల్యాప్‌టాప్‌లు కలిపి రూ. 2.63 లక్షల విలవైన గాడ్జెట్స్ కొనుగోలు చేసినా.. ఆయన వాటిని తిరిగి ఇవ్వకుండానే ప్రస్తుతం ఓ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్నారు.

ఇక జీహెచ్ఎంసీ పనిచేస్తున్న ఓ ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా రూ.5.53 లక్షలతో ఐదు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం విశేషం. ఐఏఎస్, ఐపీఎస్‌లో పాటు బల్దియాలో వివిధ హోదాల్లో పని చేసిన పలువురు అధికారులు, ఇంజనీర్లు సైతం తమకు వచ్చిన గాడ్జెట్లను ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ప్లానింగ్ అదనపు కమిషనర్‌గా పనిచేసిన వెంట్రామిరెడ్డి, సీఈ శ్రీధర్, శుభాష్ సింగ్, జియా ఉద్దీన్, అదనపు కమిషనర్ రామకృష్ణారావు, విజిలెన్స్ విభాగ డీఎస్పీ వీరయ్య, మాజీ సీవీఓ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఈ హౌజింగ్ రాందర్ కుమార్, అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన రఘు ప్రసాద్ సహా 30 మంది అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.

ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ వస్తువులను దర్జాగా అధికారులు పట్టుకెళ్లిపోతున్నారు. వీరికేమీ జీతాలు తక్కువ కాదు.. ప్రస్తుతమున్న పొజిషన్లలో తక్కువేమీ లేదు. అయినా బల్దియా వస్తువులు పట్టుకోవడం వారి ఉన్నత విద్యకు, ఉద్యోగ హోదాకు అవమానకరంగా మారుతోంది. మరోవైపు అదే స్థానంలో కొత్తగా వచ్చిన అధికారులు సైతం పాత పద్ధతిలోనే ఖరీదైన గాడ్జెట్లను కొనుగోలు చేయిస్తుండటంతో బల్దియాపై మరో భారం పడుతోంది. జీహెచ్ఎంసీ గాడ్జెట్స్ కొనుగోళ్లు, అప్పగింతపై ఏడాది కాలంగా ఆడిట్ జరగలేదు. ఖరీదైన అధికారుల వ్యవహారం ఇలా ఉంటే.. జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం బల్దియాపై తన వంతుగా ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు..

ఆదర్శంగా నిలుస్తున్న బల్దియా బాస్‌ (బాక్స్ ఐటం)

అడిషనల్ కమిషనర్లు, ఐఏఎస్‌లు, సీనియర్ అధికారులు, ఇంజనీర్లు.. ఖరీదైన గాడ్జెట్లంటూ భారం పెంచుతుంటే బల్దియాకు హెడ్ అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారుల గొంతెమ్మ కోర్కెలు, అభివృద్ధి పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ ఎప్పుడో రుణాల బాట పట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కమిషనర్ లోకేష్ కుమార్ వ్యక్తిగతంగా చాలా అనవసర ఖర్చులను తగ్గించుకుంటున్నారు. బల్దియాపై భారం పడకుండా ఆయన తన సొంత మొబైల్ మాత్రమే వాడుతున్నారు.

ఇక్కడ గతంలో పనిచేసి వెళ్లిపోయిన ఓ ఐఏఎస్ తిరిగి ఇచ్చిన ఆపిల్ మాక్ బుక్‌ ని కమిషనర్ తన రోజూ వారి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ పక్కనే ఉన్న బీఆర్‌కే భవనంలోకి సెక్రటేరియట్ మారిన తర్వాత చాలా సార్లు కమిషనర్ సాధారణ వ్యక్తిలా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలు ఉన్నాయి. కార్‌లో వెళ్తే అనవసరంగా ఇంధనం, సమయం వృథా అవుతుందని, అదే సమయంలోపు పని ముగించుకుని తాను ఆఫీసుకు తిరిగి రాగలుగుతానని కమిషనర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed