Black fungus: బీ అలర్ట్: సరిహద్దుల్లో పంజా

by  |
Black fungus: బీ అలర్ట్: సరిహద్దుల్లో పంజా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర కరోనా సెకండ్ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చూపి.. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం కలవరపెడుతోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవగా.. మృతుల సంఖ్య కలకలం రేపుతోంది.. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోనే తొలి కేసు నమోదు కాగా.. ఒక్క ముధోల్ సెగ్మెంట్‌లోనే పదికిపైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ముగ్గురు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా చికిత్స అంతంత మాత్రంగానే ఉండటంతో.. వ్యాధి సోనిన బాధితులు తప్పనిసరి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరిహద్దు నియోజక వర్గాలు, మండలాలు, గ్రామాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోనే తొలి బ్లాక్ ఫంగస్ కేసు నిర్మల్ జిల్లాలోనే నమోదు కాగా.. తాజాగా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో భైంసా మండలం చింతలబోరిలో బ్లాక్ ఫంగస్‌తో ఒకరు చనిపోగా.. ఇది వెలుగులోకి రాలేదు. ఆయనకు కరోనా వచ్చి తగ్గాక.. పక్షవాతం వచ్చి చేతు, నోరు పడిపోయింది. కన్నుకు ప్రభావం చూపడంతో.. అక్కడి నుంచి మెదడుకు ఎక్కింది. హైదరాబాద్ చికిత్స పొందుతూ చనిపోయారు. అధికారికంగా వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరించకపోగా.. బ్లాక్ ఫంగస్ లక్షణాలతోనే చనిపోయారు.

ఇటీవల కుభీర్ మండలానికి చెందిన దామాజీ కరోనా వచ్చాక తగ్గిపోగా.. అంతలోనే బ్లాక్ ఫంగస్ వచ్చింది. ఈయన హైదరాబాదులో చికిత్స పొందుతూ చనిపోయారు. తాజాగా ఆయన సోదరుడికి కూడా కరోనా సోకగా.. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వచ్చింది. సోదరులిద్దరికీ కలిపి ఇప్పటికే రూ.20 లక్షల వరకూ వెచ్చించారు. ముధోల్ మండలం ఆష్టాలో ఒకరు ఇవే లక్షణాలతో మృతి చెందగా.. మరొకరు హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. భైంసాకు చెందిన తోట లింగురాంకు బ్లాక్ ఫంగస్ వచ్చి.. 20 రోజులు అవుతోంది. ముందుగా కరోనా సోకగా.. కోలుకున్నాక అయిదారు రోజుల తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. నాలుక నలుపు రంగుగా మారి.. నోటి నుంచి కన్ను వరకు నలుపు రంగు పాకింది. నోరు కొద్దిగా తగ్గగా.. నేడు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రిలో కన్ను ఆపరేషన్ చేస్తున్నారు. ముధోల్, బాసరలో ఒక్కొక్కరికి వచ్చింది. ఒక్క ముధోల్ సెగ్మెంటులోనే పదికి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందటం కలవరాన్ని కలిగిస్తోంది.

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత నాలుగైదు రోజుల క్రితం రిమ్స్లో మూడు కేసులు నమోదుకాగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు ఒకరిద్దరు ఈ వైరస్ సోకిన వారు చేరుతున్నారు. పరిస్థితి విషమించగానే హైదరాబాదు కార్పొరేట్ ఆస్పత్రులకు, కింగ్ కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి చికిత్స కోసం పంపుతున్నారు. భీంపూర్కు చెందిన ఒకరు బ్లాక్ ఫంగస్ రాగా.. హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. ఇదే మండలం అర్లి(టి)కి చెందిన ఒకరు ఏప్రిల్లో కరోనా సోకగా.. తగ్గిపోయాక బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. రిమ్స్‌లో చేర్పించగా.. తగ్గకపోవటంతో హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక.. ఎక్కువ రోజులు ఐసీయూలో ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడిన వారు, షుగరు ఎక్కువగా ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ వస్తోంది. ఇందుకు జిల్లాలో సరైన వైద్యం లేకుండా పోయింది. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఇటీవల భైంసా షేపెంటుకు షుగర్ లెవల్ తగ్గేందుకు స్థానికంగా ట్రీట్మెంట్ చేయగా.. నిర్మల్లో కన్ను, నోరుకు ఈఎన్టీ ట్రీట్మెంట్ చేశారు. చివరికి హైదరాబాద్ కింగ్ కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల బిల్లు చెల్లించాల్సి వస్తోంది.

Next Story

Most Viewed