సంక్షోభ సమయంలో వారెంటీ, సర్వీస్ గడువు పొడిగిస్తున్న ఆటో కంపెనీలు!

by  |
సంక్షోభ సమయంలో వారెంటీ, సర్వీస్ గడువు పొడిగిస్తున్న ఆటో కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను విధించాయి. ఈ క్రమంలో వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ కంపెనీలు వాహనాల వారెంటీ, సర్వీసుల విషయంలో వెసులుబాటులు ఇస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, టయోటా, ఎంజీ మోటార్స్ వంటి కార్ల తయారీ కంపెనీలు, హీరో మోటోకార్ప్ వంటి ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు వారెంటీ, సర్వీస్ గడువును పెంచాయి. ఇదే బాటలో బుధవారం బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఆడి కంపెనీలు సైతం తన వినియోగదారులకు ఊరటనిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. బజాజ్ ఆటో ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్య వారెంటీ, సర్వీస్ ముగియనున్న అన్ని మోడల్ వాహనాలకు జులై 31 వరకు గడువు పెంచుతున్న తెలిపింది.

వాణిజ్య వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలకు కూడా ఈ వెసులుబాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సైతం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య వారెంటీ సర్వీస్ ముగిసే కమర్షియల్ వాహనాలకు మరో నెల రోజుల గడువు పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్య ముగిసే ప్యాసింజర్ వాహనాల వారెంటీ, సర్వీస్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ సైతం తన వినియోగదారులకు వారెంటీ, సర్వీస్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి మే మధ్య వారెంటీ, సర్వీస్ ముగిసే వినియోగదారులందరికీ ఈ అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది.



Next Story

Most Viewed