అకాడమీ నిధుల గోల్ మాల్.. తిరిగిస్తామన్న బ్యాంక్..

by  |
bank
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు అకాడమీకి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉన్న నిధులను కొందరు ఏజెంట్లు కాజేసిన వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తుంది. గల్లంతైన రూ.10 కోట్లను తిరిగి చెల్లించడానికి కెనరాబ్యాంకు అంగీకరించింది. యూనియన్ బ్యాంకుకు చెందిన పలు శాఖల్లో రూ. 53 కోట్లు గల్లంతైన అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. బ్యాంకు అధికారులు దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. ప్రస్తుతానికి కెనరాబ్యాంకులో గల్లంతైన రూ. 10 కోట్లు మాత్రం చెల్లించడానికి బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ఆ డబ్బు తిరిగి అకాడమీకి అందనున్నది.

వివరాల్లోకి వెళ్తే.. కెనరాబ్యాంక్ చందానగర్ బ్రాంచిలో తెలుగు అకాడమీ రూ. 10 కోట్లను ఒక సంవత్సర కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేసింది. యూనియన్ బ్యాంకుకు చెందిన కార్వాన్ బ్రాంచిలో రూ. 40 కోట్లను, సంతోష్ నగర్ బ్రాంచిలో రూ. 13 కోట్లను జమ చేసింది. వీటన్నింటినీ నిందితులు కాజేశారు. వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. కెనరాబ్యాంకు మేనేజర్‌తో కుమ్మక్కైన నిందితులు, పలువురు బ్రోకర్లు, ఏజెంట్లు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 10 కోట్లను ఇతర బ్యాంకుల్లోకి బదిలీ చేసుకుని ఆ తర్వాత పలు దఫాలుగా విత్‌డ్రా చేసుకుని కాజేసినట్లు తేలింది.

ఈ వ్యవహారంలో అకాడమీ అధికారులు, కెనరాబ్యాంకు అధికారుల మధ్య సీసీఎస్ పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేయించి విషయాన్ని అర్థం చేయించారు. బ్యాంకు మేనేజర్ ప్రమేయంతోనే గల్లంతైనందున తిరిగి చెల్లించనున్నట్లు హామీ ఇచ్చింది. అకాడమీ దగ్గర ఉన్న ఒరిజినల్ పత్రాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు రెండు మూడు రోజుల్లో తిరిగి అకాడమీ ఖాతాలో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తీరులో యూనియన్ బ్యాంకు అధికారులతోనూ అకాడమీ అధికారులు సమావేశమై చర్చించారు. ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ బ్యాంకుకు చెందిన రెండు శాఖల నుంచి రూ. 53 కోట్లు గల్లంతయ్యాయి. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ వస్తుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed