‘‘రబీ ధాన్యం కొనుగోలుకు రెడీగుండండి’’

by  |
‘‘రబీ ధాన్యం కొనుగోలుకు రెడీగుండండి’’
X

దిశ, న్యూస్‌బ్యూరో: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ రబీలో 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మంత్రులు అంచనా వేశారు. గత ఏడాది రబీలో ఒక్క పౌరసరఫరాల శాఖనే 37 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందనీ, ఈ రబీలో ఇది మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. భారీగా ధాన్యం దిగుబడి అవనున్న నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని నిల్వ చేసే గోదాముల విషయంలో మార్కెటింగ్‌శాఖ, ఎస్‌డబ్లూసీ, సీ‌డబ్లూసీ సమన్వయం చేసుకోవాలని వారు సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ కొలిచే యంత్రాలు,‌ ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్‌లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లకు చెల్లించే అదనపు మిల్లింగ్ ఛార్జీలపైనా ఈ సమావేశంలో చర్చించారు. దళారులెవరూ ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి విక్రయాలు జరపకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags : rabi, paddy, procurement, ministers committee meeting

Next Story

Most Viewed