‘కరోనా కంటే.. సీఏఏతోనే దేశానికి ప్రమాదం’

by  |
‘కరోనా కంటే.. సీఏఏతోనే దేశానికి ప్రమాదం’
X

దిశ, న్యూస్ బ్యూరో : దేశానికి కరోనా కంటే సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతోనే ప్రమాదమెక్కువని వామపక్ష నాయకులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఎంత ముఖ్యమో, ఈ చట్టాలు రాష్ట్రానికి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ అంతే ముఖ్యమని తెలిపారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామనీ, కానీ, బీజేపీ తీసుకొచ్చిన ఎన్పీఆర్ అంశాలను రాష్ట్రంలో సేకరించబోమని కేంద్రానికి స్పష్టతనివ్వాలని తెలిపారు. ఈ మేరకు జనగణన సిబ్బందికి ఆదేశాలు జారీచేయాలని సూచించారు. అలాగే, ఈ నెల 23న కరోనా వైరస్ నియమాలకు లోబడి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహిస్తామని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్పీఆర్‌లో ఎలాంటి వ్యక్తిగత అంశాలను సేకరించబోమని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. బీజేపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లౌకిక రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనుధర్మ రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదనీ, పంజాబ్, కేళర వంటి రాష్ట్రాల మాదిరిగా ఎన్పీఆర్ అమలు చేయబోమని ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Tags: CAA, NRC, NPR, CPI, CPM, chada venkat reddy, thammineni veerabhadram, carona virus, caa is dangerous than carona,



Next Story

Most Viewed