'గ్రేట్ లెర్నింగ్' ని సొంతం చేసుకున్న బైజూస్..

by  |
గ్రేట్ లెర్నింగ్ ని సొంతం చేసుకున్న బైజూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఉన్నత విద్యా రంగంలోని ‘గ్రేట్ లెర్నింగ్’ యాప్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ విభాగంలో ప్రవేశించినట్టు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వరుసగా కొనుగోళ్లను కొనసాగిస్తోన్న బైజూస్ తాజాగా గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను 600 మిలియన్ డాలర్ల(రూ. 4,500 కోట్ల)కు కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియను మరింత వేగవంతంగా కొనసాగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొనుగోలు చేసిన మొత్తాన్ని కొంత నగదు రూపంలోనూ, మిగిలిన మొత్తాన్ని స్టాక్స్, ఇతర మార్గాల్లో రూపంలో చెల్లించనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సుల విభాగంలో పెద్ద ఎత్తున విస్తరించడానికి అదనంగా మరో 400 మిలియన్ డాలర్లు(రూ. 3000 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. దీంతో ఈ విభాగంలో మొత్తం పెట్టుబడులు 1 బిలియన్ డాలర్లు(రూ. 7,500 కోట్లు)గా ఉండనుంది.

గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను కొనుగోలు చేసినప్పటికీ కంపెనీ తమ ఆధ్వర్యంలో స్వతంత్రంగానే కొనసాగుతుందని బైజూస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రేట్ లెర్నింగ్ వ్యవస్థాపకులు మోహన్ లక్ష్మణరాజు, సహ-వ్యవస్థాపకుడు హరి నాయర్, అర్జున్ నాయర్‌ల సార్థ్యంలోనే కంపెనీ ముందుకెళ్తుందని బైజూస్ వివరించింది.

Next Story

Most Viewed