కొవిడ్ వ్యాక్సిన్.. అపోహలు.. నిజాలు!

by  |
కొవిడ్ వ్యాక్సిన్.. అపోహలు.. నిజాలు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచం ఒక మహమ్మారితో పోరాడుతున్నప్పుడు.. అబద్ధాలకు అడ్డుకట్టవేసి, సత్యాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే SARS-CoV-2 నుంచి రక్షణ పొందేందుకు సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ల తయారీకి శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు COVID-19 వ్యాక్సిన్లను విడుదల చేస్తుండగా.. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇప్పుడు మరో కొత్త సవాల్‌ను ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగించే విషయం. కొంతమంది యాంటీ వాక్సికర్లతో పాటు వ్యాక్సిన్లు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమవుతాయని నమ్మే వ్యక్తులు వ్యాక్సినేషన్‌పై తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వాస్తవానికి గతంలో అనేక రకాల టీకాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడగలిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం 2010- 2015 మధ్య టీకాల వల్లే 10 మిలియన్ల మరణాలు నిరోధించగలిగారు. కానీ COVID-19 టీకాలు చాలా వేగంగా తయారుకావడం పట్ల ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇంతకీ అందులో ఏవి అపోహలు.. ఏవి నిజాలు? తెలుసుకుందాం.

అగ్రరాజ్యంలోని ప్రజలతో పాటు అనేక దేశాల పౌరులు.. తమను కొవిడ్ బారి నుంచి నిరోధించే వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారు. అయితే అందరినీ ఇందుకు సంబంధించిన వాస్తవాలతో ఒప్పించినప్పటికీ, సంశయించే వారికి ‘మెడికల్ న్యూస్ టుడే’లో ప్రచురితమైన ఈ సమాచారం ఉపయోగకరంగా ఉండనుంది.

వేగంగా అభివృద్ధి :

శాస్త్రవేత్తలు COVID-19 వ్యాక్సిన్లను ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్ల కంటే వేగంగా అభివృద్ధి చేశారన్నది నిజం. అయినప్పటికీ ఎక్కడా వాటి భద్రతా ప్రొఫైల్‌ను తగ్గించలేమని వారు వెల్లడించారు. SARS-CoV-2 శాస్త్రానికి కొత్తదే అయినా, పరిశోధకులు దశాబ్దాల నుంచే కరోనా వైరస్‌లపై అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం ఉండటంతో నిధులకు ఇబ్బంది లేకుండా స్పాన్సర్లు ముందుకొచ్చారు. అంతేకాదు ఇతర దేశాల సహాయ సహకారాలు, అన్ని దేశాల్లో జరిగిన అధ్యయనాలు టీకా విషయంలో మేలు చేశాయి. వలంటీర్ల విషయంలోనూ ఎక్కడా లోటు ఏర్పడలేదు. చాలామంది ముందుకొచ్చి పని చేశారు. సాధారణ పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్ ఓ సీక్వెన్స్ ప్రకారం నడుస్తుంటాయి. కానీ కొవిడ్ సందర్భంలో మాత్రం శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలను ఏకకాలంలో అమలు చేయడం వల్ల సమయం ఆదా అయింది. దీంతో భద్రత విషయంలో రాజీ పడకుండా వ్యాక్సిన్‌ను వేగంగా అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే, సాంకేతికత కూడా పెరగడం సానుకూలాంశం.

మైక్రోచిప్ ఉంటుందా.?

గతేడాది యూఎస్‌లో నిర్వహించిన యుగోవ్ పోల్‌లో 1,640 మంది పార్టిసిపేట్ చేయగా, కొవిడ్ గురించి వారిని అనేక ప్రశ్నలు అడిగారు. మనిషిలో మైక్రోచిప్‌లను అమర్చడానికి బిల్ గేట్స్ COVID-19 టీకాలను ఓ వెహికల్‌గా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడని 28% మంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌, రేడియో ట్రాన్స్‌పాండర్, రేడియో రిసీవర్, ట్రాన్స్‌మీటర్ వంటి పరికరాలున్నట్లు భావించారు. ఈ మైక్రోచిప్స్ ఉన్నత వర్గాలకు చెందిన ప్రజల ప్రతీ కదలికను ట్రాక్ చేస్తుందని కొంతమంది తెలిపారు. వాస్తవానికి మొబైల్ ఫోన్లు ఇప్పటికే ఆ పనిని అప్రయత్నంగా పూర్తి చేస్తున్నాయి. ఇదంతా అవాస్తవం COVID-19 వ్యాక్సిన్లలో ఎలాంటి మైక్రోచిప్స్ అమర్చ లేదని ‘మెడికల్ న్యూస్ టుడే’ స్పష్టం చేసింది.

కొవిడ్ 19 లైవ్?

టీకా రకంతో సంబంధం లేకుండా.. ఏ వ్యాక్సిన్‌ కూడా లైవ్ వైరస్‌ను కలిగి ఉండదు. తలనొప్పి లేదా చలి వంటి దుష్ప్రభావాలు రోగనిరోధక ప్రతిస్పందన వల్ల సంభవిస్తాయి.

వంధ్వత్వం వస్తుందా?

కరోనా వ్యాక్సిన్లు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా, భవిష్యత్తులో గర్భధారణకు హానిచేస్తాయనేందుకు కూడా ఎలాంటి రుజువులు లేవు. కరోనా వైరస్‌లో కనిపించే స్పైక్ ప్రోటీన్‌కు, సిన్సిటిన్ -1 అనే ప్రోటీన్‌కు మధ్య సంబంధం ఉన్నందున ఈ పుకారు ప్రారంభం కాగా, గర్భధారణ సమయంలో మావి గర్భాశయానికి అనుసంధానించి ఉండటానికి సిన్సిటిన్ -1 చాలా ముఖ్యమైనది. స్పైక్ ప్రోటీన్ సిన్సిటిన్ -1తో సమానంగా కొన్ని అమైనో ఆమ్లాలను పంచుకున్నప్పటికీ దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు.

ఫెటల్ టిష్యూ ?

ఏ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియలో కూడా ఫెటల్ సెల్స్ (పిండ కణాలు) ఉపయోగించరు. చాలా సంవత్సరాలుగా టీకాల్లో పిండ కణాలు ఉన్నాయనే పుకార్లు వ్యాపించాయి. కరోనా టీకాల్లోనే కాదు, మరే ఇతర టీకాల్లో ఫెటల్ సెల్స్ ఉండవు’ అని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ మైఖేల్ హెడ్‌ తెలిపారు.

వైరస్ రాదా?

కొవిడ్19 టీకాలను SARS-CoV-2 ఇన్‌ఫెక్షన్ తర్వాత ప్రజలు అనారోగ్యానికి గురవ్వకుండా, వారి ఇమ్యూనిటీని పెంచడానికి రూపొందించారు. అందుకే టీకాలు వేసిన వ్యక్తికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది. దీంతో వాళ్లు కూడా కొవిడ్ వ్యాప్తి చేయగలరు. అందుకే మాస్క్ ధరించడంతో పాటు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇదే విషయాన్ని డాక్టర్లు పదే పదే చెప్తున్నా.. ప్రజలు మాత్రం కొవిడ్ రాదనే ధీమాతో నిబంధనలు పాటించడం లేదు.

ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్

గుండె జబ్బులు, మధుమేహం, ఊ‌పిరితిత్తుల వ్యాధితో బాధపడేవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయినప్పటికీ, ఎవరైనా ఫ్లూ షాట్ తీసుకోవడానికి ఆందోళన చెందుతుంటే, వైద్యుడితో మాట్లాడాలి. వాస్తవానికి, ఊబకాయం, గుండె జబ్బులున్న వారికి కొవిడ్ కణాలు మరింత తీవ్రమైన COVID-19 లక్షణాలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి, టీకాలు వేసుకోవడమే ఉత్తమం. తీవ్రమైన అలర్జీలు ఉన్న వ్యక్తులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదు.

డెన్మార్క్‌లో టీకాలు వేసిన తర్వాత కొందరికి రక్తం గడ్డకట్టిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి దుష్ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ టీకాలు వాడటమే సురక్షితమని వైద్యులు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రక్తం గడ్డకట్టడాన్ని దుష్ప్రభావంగా పరిగణించలేదు. అంతేకాదు కొవిడ్ టీకా వల్ల ఎవరి డీఎన్‌ఏలోనూ మార్పులు సంభవించవు.

Next Story

Most Viewed