నకిలీ మందుల నివారణకు క్యూఆర్ కోడ్ విధానం తెచ్చే యోచనలో ప్రభుత్వం!

by Dishanational4 |
నకిలీ మందుల నివారణకు క్యూఆర్ కోడ్ విధానం తెచ్చే యోచనలో ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: నకిలీ మందులను నియంత్రించడానికి కేంద్రం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నకిలీ, నాసిరకం మందులను నిరోధించేందుకు త్వరలో 'ట్రాక్ అండ్ ట్రేస్ ' విధానాన్ని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. అంటే, మార్కెట్లో విక్రయించే మందులపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీని ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసే మాత్రలు నకిలీవా కాదా అనే విషయాన్ని గుర్తించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. మందులను ప్యాకింగ్ చేసే స్ట్రిప్‌లు కానీ, ట్యూబ్, బాటిల్ వంటి వాటిపై ఈ క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు.

మొదటి దశలో 300 రకాల మందులపై ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం చూస్తుండగా, రూ. 100 కంటే ఎక్కువ విలువైన వాటిని మొదటగా దీనికోసం ఎంచుకోనున్నారు. ఆ తర్వాత దశల వారీగా క్యూఆర్ కోడ్ విధానాన్ని మిగిలిన వాటికి తప్పనిసరి చేయనున్నారు. ప్రధానంగా ప్రజలు ఎక్కువగా వాడే పెయిన్ కిల్లర్స్, బీపీ, విటమిన్ మాత్రలు, యాంటీ-అలెర్జిక్స్, యాంటీ-బయోటిక్ మందులను తయారు చేసే కంపెనీలు క్యూఆర్ కోడ్‌ను అమలు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

దేశంలో పలుచోట్ల మందుల కంపెనీలు నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనికోసం క్యూఆర్ కోడ్, వినియోగదారుల కోసం ప్రభుత్వం కొత్తగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇందులో మందులపై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవా కావా అనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇదే సమయంలో ఈ చర్యల వల్ల మందుల ధరలు 3-4 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో సుమారు 10 శాతం వైద్య ఉత్పత్తులు నాణ్యత లేనివి లేదా నకిలీవి ఉన్నాయని తేలింది.


Next Story

Most Viewed