సీసీఐ భారీ జరిమానాపై స్పందించిన Google!

by Disha Web Desk 7 |
సీసీఐ భారీ జరిమానాపై స్పందించిన Google!
X

న్యూఢిల్లీ : గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వరుస వారాల్లో భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి స్పందించిన గూగుల్, తమ వినియోగదారులు, డెవలపర్లకు కావాల్సిన మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. డిజిటల్ భారత్‌కు దోహదేపడేలా గూగుల్ అనుసరించే విధానాలు ఉన్నాయని పేర్కొంది. 'ఇటీవల సీసీఐ విధించిన జరిమానాకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తాం. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే టెక్నాలజీ, వినియోగదారుల రక్షణ, భద్రత, సౌకర్యాల ద్వారా భారత్‌లోని డెవలపర్లు ప్రయోజనాలు పొందారు.

తక్కువ ఖర్చుల ద్వారా తమ విధానం భారత డిజిటల్ వృద్ధికి బలాన్నిచ్చింది. కోట్లాది మందికి డిజిటల్ వినియోగాన్ని అందజేసిందని' గూగుల్ అధికార ప్రతినిధి వివరించారు. కాగా, గూగుల్‌పై తాజాగా సీసీఐ రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న కారణంతో ఈ చర్యలు తీసుకుంది. అలాగే, ప్లే స్టోర్‌లో తమ సొంత యాప్‌లే మొదటగా వచ్చేలా అనుసరించే విధానాలను తక్షణం మానుకోవాలని సూచించింది. అంతకుముందు వారంలో సైతం గూగుల్‌పై రూ. 1,337.76 కోట్ల జరిమానాను విధిస్తూ సీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కారణంగా ఈ జరిమానా విధించింది.



Next Story

Most Viewed