అక్టోబర్‌లో 700 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు!

by Disha Web Desk 17 |
అక్టోబర్‌లో 700 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెల పండుగ సీజన్ నేపథ్యంలో లావాదేవీలు భారీగా పెరగడంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) విధానం మొదలైనప్పటి నుంచి అత్యధికంగా జరిగాయి. దీంతో అక్టోబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 730 కోట్లకు చేరుకున్నాయని, వీటి విలువ రూ. 12.11 లక్షల కోట్లుగా ఉంటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది.

యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 73 శాతం పెరగ్గా, విలువ పరంగా 57 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీలు 325 కోట్లు మాత్రమే జరిగాయి. గడిచిన రెండేళ్ల కాలంలో యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కొన్ని నెలలు లావాదేవీలు నెమ్మదించినప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కావడం, డిజిటల్ వినియోగం సాధారణం కావడంతో యూపీఐ లావాదేవీలు గణనీయంగా నమోదవుతున్నాయి.

ప్రస్తుత ఏడాది మేలో మొదటిసారిగా యూపీఐ లావాదేవీల విలువ రూ. 10 లక్షల కోట్ల మార్కును చేరాయి. సంఖ్యా పరంగా, 2016లో యూపీఐ విధానం మొదలైన తర్వాత 2019 అక్టోబర్‌లో తొలిసారి 100 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత ఏడాదిలోపే 200 కోట్లు, మళ్లీ పది నెలల్లోనే నెలకు 300 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అనంతరం తక్కువ నెలల వ్యవధిలోనే యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ లావాదేవీలు 488 శాతం పెరిగాయని ఎన్‌పీసీఐ గణాంకాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed