ఎయిర్ఇండియాకు రూ. కోటి జరిమానా విధించిన డీజీసీఏ

by Dishanational1 |
ఎయిర్ఇండియాకు రూ. కోటి జరిమానా విధించిన డీజీసీఏ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎయిర్ఇండియాకు రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు బుధవారం విమానయాన సంస్థకు డీజీసీఏ నోటీసులు ఇచ్చింది. దూర ప్రాంతాలు, క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించే ఎయిర్ఇండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ సంస్థ ఉద్యోగి డీజీసీఏకి తెలిపారు. అలాగే, లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణను కూడా పట్టించుకోవడంలేదని ఉద్యోగి తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన డీజీసీఏ, ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలు అనుసరించడం లేదంటూ జరిమానా విధించి, షోకాజ్ నోటీసులను పంపింది. ఎయిర్‌లైన్ కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు సేవలు అందించాలని డీజీసీఏ వెల్లడించింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో సైతం ఎయిర్ఇండియాతో పాటు మరో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులిచ్చింది. పొగమంచు వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు నడిపేందుకు శిక్షణ కలిగిన పైలట్లను నియమించని కారణంగా ఈ నోటీసులు జారీ చేసింది.

Next Story

Most Viewed