సూపర్ యాప్ కోసం అదనపు నిధులు కేటాయించే పనిలో టాటా గ్రూప్!

by Disha Web Desk 17 |
సూపర్ యాప్ కోసం అదనపు నిధులు కేటాయించే పనిలో టాటా గ్రూప్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టాటా గ్రూప్ సంస్థ తన డిజిటల్ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసేందుకు సూపర్ యాప్ 'టాటా న్యూ' లో సుమారు రూ. 16.5 వేల కోట్ల మూలధనాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. టాటా డిజిటల్ కంపెనీ ఒప్పందం ప్రకారం రాబోయే రెండేళ్ల కాలంలో అదనపు నిధులను అందుకోవచ్చని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఈ నిధులు టాటా సంస్థ ప్రారంభించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ టాటా న్యూ డిజిటల్ ఆఫర్‌లను బలోపేతం చేస్తూనే, దాని టెక్నాలజీ అభివృద్ధిని, ఇతర వ్యయ అవసరాలను తీర్చేందుకు దోహదపడనుంది.

అయితే, ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, సూపర్ యాప్ విలువను పెంచేందుకు అవసరమైన మార్గాలను టాటా డిజిటల్‌తో టాటా గ్రూప్ సంప్రదిస్తోందని, రానున్న రోజుల్లో ఒప్పందం విలువ మారొచ్చని సంబంధిత వ్యక్తులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి టాటా గ్రూప్ గానీ, టాటా డిజిటల్ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు.

కాగా, 2020 ద్వితీయార్థంలో దేశీయంగా మొట్టమొదటి సూపర్ యాప్‌గా వచ్చిన టాటా న్యూ ఇప్పటికే ఈ-కామర్స్ రంగంలో నిలదొక్కుకున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీనిస్తుందని భావించారు. అయితే, టెక్నాలజీ లోపాలు, వినియోగదారుల నుంచి పెరిగిన ఫిర్యాదుల కారణంగా గతేడాది నుంచి ఆదరణ కోల్పోయింది. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద సంస్థలైన రిలయన్స్, అదానీలు సైతం తమ సొంత సూపర్ యాప్‌లను తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

దాంతో టాటా సంస్థ అప్రమత్తమై టాటా న్యూ సామర్థ్యాన్ని పెంచేందుకు మరిన్ని నిధులు సమకూర్చాలని ప్రయత్నిస్తోంది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, టాటా న్యూ 2022లో 8 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలను సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు అందులో సగానికే పరిమితం కావడం గమనార్హం.

Also Read...

వినియోగదారులకు షాక్ ఇచ్చిన మారుతీ సుజుకి! అన్ని మోడళ్లపై ధరల పెంపు

Next Story