845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

by Dishanational1 |
845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం, ప్రపంచ మార్కెట్ల బలహీన ధోరణుల మధ్య సోమవారం సూచీలు అధిక నష్టాలతో పతనమయ్యాయి. గత వారాంతం ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడితో ఆ దేశం తిరిగి ప్రతీకార దాడులు చేయవచ్చని మదుపర్లు అంచనా వేశారు. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ నిధులు తగ్గడం, యూఎస్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదవడం వంటి అంశాలు మన మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ దాదాపు 250 పాయింట్లు కుదేలైంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 845.12 పాయింట్లు నష్టపోయి 73,399 వద్ద, నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, ఐటీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన అన్నీ పతనమయ్యాయి. అత్యధికంగా విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ 2 శాతం నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.43 వద్ద ఉంది. భారీ నష్టాల కారణంగా మదుపర్లు రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు చేరింది.

Next Story

Most Viewed