స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు..!

by Disha Web Desk 13 |
స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు..!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస సెషన్లలో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. జీవితకాల గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా దెబ్బతిన్న సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో ప్రధానంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు, వృద్ధి అంచనాలను తగ్గించడంతో నీరసించాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య కదలాడాయి. ఆ తర్వాత ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన అనంతరం సూచీలు నెమ్మదిగా దిగజారాయి. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణం ధోరణి మరికొంత కాలం కొనసాగుతుందని దాస్ చెప్పడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం తో స్టాక్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు నష్టాలు నమోదయ్యాయి. వీటికి తోడు భారత కరెన్సీ మరింత పతనమవుతుండటంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 215.68 పాయింట్లు పడిపోయి 62,410 వద్ద, నిఫ్టీ 82.25 పాయింట్లు నష్టపోయి 18,560 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు మాత్రమే బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.43 వద్ద ఉంది.


Next Story

Most Viewed