1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

by Dishanational1 |
1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. ఒకరోజు సెలవు తర్వాత మంగళవారం ప్రారంభమైన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే హై నుంచి 1,600 కంటే ఎక్కువ పాయింట్లను కోల్పోయింది. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. సెన్సెక్స్ వెయ్యి, నిఫ్టీ 300కు పైగా పాయింట్ల పతనంతో షేర్ మార్కెట్లు నెల రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. దీనికి తోడు రెండేళ్ల నుంచి మీడియా రంగంలో నానుతున్న కీలకమైన సోనీ-జీ ఒప్పందం రద్దవడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి.

గత కొన్ని సెషన్లలో కొన్ని కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆయా షేర్ల అమ్మకాలకు దిగడం కూడా మార్కెట్ల భారీ క్షీణతకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,053.10 పాయింట్లు కోల్పోయి 70,370 వద్ద, నిఫ్టీ 333 పాయింట్లు పడిపోయి 21,238 వద్ద ముగిశాయి. నిఫ్టీ ఇండెక్స్‌లో మీడియా రంగం ఏకంగా 12.87 శాతం కుదేలవగా, రియల్టీ 5 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు 2 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.16 వద్ద ఉంది.


Next Story

Most Viewed