కొత్త రికార్డు గరిష్ఠాలను తాకిన సూచీలు

by Dishanational1 |
కొత్త రికార్డు గరిష్ఠాలను తాకిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కూడా పరిణామాలు అనుకూలంగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంతో పాటు ఫైనాన్స్, ఐటీ రంగాల్లో ర్యాలీ మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 74,500 మార్కును దాటింది. నిఫ్టీ 22,619 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకింది. గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో రికార్డు స్థాయిల నుంచి తగ్గినప్పటికీ మెరుగైన లాభాలు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 350.81 పాయింట్లు ఎగసి 74,227 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 22,514 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, టీసీఎస్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, రిలయన్స్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.41 వద్ద ఉంది.


Next Story

Most Viewed