మెటల్, బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో లాభపడిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
మెటల్, బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో లాభపడిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒకరోజు విరామం అనంతరం తిరిగి లాభాలను సాధించాయి. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే సానుకూలంగా కదలాడిన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో కొనసాగాయి. మిడ్-సెషన్ సమయంలో ఎఫ్ అండ్ ఓ గడువు ముగింపు సందర్భంగా కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ తిరిగి పుంజుకున్నాయి.

ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్ల కోసం మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతివ్వడంతో సూచీలు మెరుగుపడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ రుణ రేట్ల పెంపును తగ్గిస్తాయనే అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఆసియా మార్కెట్లు లాభపడటం మన మార్కెట్లకు సానుకూలంగా మారింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 212.88 పాయింట్లు పెరిగి 59,756 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లాభపడి 17,736 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం మాత్రమే నీరసించగా, మిగిలిన రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, డా.రెడ్డీస్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి.

బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, విప్రో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.51 వద్ద ఉంది.



Next Story

Most Viewed