స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!

by Disha Web Desk 17 |
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గత వారం వరకు అన్ని సెషన్లలో రికార్డు గరిష్ఠాలకు చేరిన సూచీలు లాభాల స్వీకరణ కారణంగా వరుసగా మూడవ సెషన్‌లో నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంత కాలం కొనసాగనుందనే సంకేతాలతో అమెరికా మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత ఏర్పడింది.

దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, దేశీయంగా ఆర్‌బీఐ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు నీరసించాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208.24 పాయింట్లు నష్టపోయి 62,626 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు పడిపోయి 18,642 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ రంగాలు మాత్రమే రాణించగా, మిగిలిన రంగాలు బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, అల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, డా.రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.

దెబ్బతిన్న రూపాయి..

అమెరికా సేవల రంగ కార్యకలాపాలు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో మరికొంత కాలం ప్రస్తుత ధోరణిని కొనసాగించవచ్చనే పరిణామాల మధ్య మంగళవారం డాలర్ విలువ పెరిగింది. ఈ క్రమంలో భారత కరెన్సీ రూపాయి విలువ మార్కెట్ ముగిసే సమయానికి ఏకంగా 80 పైసలు బలహీనపడి రూ. 82.63 వద్ద ఉంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయి విలువ బలహీన పడేందుకు కారణాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.


Next Story