ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు సగటున 20 శాతం జీతాల పెంపు

by Dishanational1 |
ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు సగటున 20 శాతం జీతాల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కంపెనీల్లో ఉన్న సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది మెరుగైన జీతాల పెంపు ఉంటుందని ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అధికంగా ఉండటంతో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణల నేపథ్యంలో సీనియర్ లెవల్‌లో ఉన్న ఉద్యోగులకు సగటున 20 శాతం పెంపు ఉంటుందని మైకెల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్-2024 నివేదిక పేర్కొంది. సంప్రదాయ పరిశ్రమల్లో నియామకాలు భారీగా పెరిగాయని, ముఖ్యంగా తయారీ, నిర్వహణ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉందని నివేదిక పేర్కొంది. వివిధ రంగాలలో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థకు ఆధారమైన ఐటీ సేవల పరిశ్రమ కొత్తరూపును సంతరించుకుంటోందని, ఈ రంగంలో కంపెనీలు సుమారు 10 శాతం వరకు జీతాలను పెంచే అవకాశం ఉందని పేజ్ గ్రూప్ ఎండీ అంకిత్ అగర్వాలా అన్నారు. ఇదే సమయంలో పునరుత్పాదక, కన్స్యూమర్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో దేశీయ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఐటీ, టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, మిడిల్ మేనేజ్‌మెంట్ వారికి 30-40 శాతం, సీనియర్ ఉద్యోగులకు 20-30 శాతం జీతాల పెరుగుదల ఉంటుందని నివేదిక వెల్లడించింది. నిర్మాణ, రియల్టీ రంగాల్లో ఈ పెంపు 20-30 శాతం, 25-45 శాతం, 20-30 శాతం ఉంటుందని నివేదిక పేర్కొంది.



Next Story

Most Viewed