విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

by Disha Web Desk 17 |
విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ కీలక సూచనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలు ముందుగా ప్రమాదాలను అంచనా వేయాలని విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమాన సంస్థలను కోరింది. ఏప్రిల్ 16న పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్‌లున్‌మాంగ్ వుల్నామ్ మాట్లాడుతూ, ఈ మార్గాల్లో ప్రయాణించే ముందు తమ సొంత రిస్క్ అసెస్‌మెంట్‌ను నిర్వహించాలని విమానయాన సంస్థలను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా విమానాలు రద్దు కాగా, ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో సహా ఇతర విమాన సంస్థలు తమ మార్గాన్ని మార్చుకుని కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి.

ఇరాన్, ఇజ్రాయెల్‌ పై డ్రోన్లు, క్షిపణులతో దాడిచేయడంతో విమానాలు ఆ మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయితే కొత్త దారిలో ప్రయాణించడం వల్ల విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం కూడా ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే ఇంధన ధరలు అధికంగా ఉండగా, ఇప్పుడు ఇంధనం కోసం మరింత వెచ్చించాల్సి వస్తుంది. ఇది విమాన సంస్థలపై ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. దీంతో విమాన చార్జీల ధరలు పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమస్య ఇలాగే కొనసాగితే వేసవి సెలవుల సీజన్‌లో విమాన సంస్థలు భారీ ఆదాయాన్ని కోల్పోతాయని , ICRA కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్, సుప్రియో బెనర్జీ అన్నారు.


Next Story