జూలైలో 18 శాతం పెరిగిన రిటైల్ అమ్మకాలు!

by Disha Web Desk 16 |
జూలైలో 18 శాతం పెరిగిన రిటైల్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం కరోనా ముందుస్థాయిల కంటే ఎక్కువ వృద్ధి సాధించాయని పరిశ్రమాల సంఘం రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) వెల్లడించింది. 2019, జూలైలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే గత నెలలో 18 శాతం ఎక్కువ జరిగాయని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ఏఐ తాజా నివేదిక ప్రకారం, ప్రధానంగా తూర్పు భారతంలో 25 శాతం ఎక్కువ రిటైల్ అమ్మకాలు నమోదవగా, దక్షిణాదిలో 21 శాతం, ఉత్తరాన 16 శాతం, పశ్చిమంలో 10 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే 2019, జూలై నాటితో పోలిస్తే స్పోర్ట్స్ వస్తువుల అమ్మకాలు అత్యధికంగా 32 శాతం పెరిగాయి.

దీని తర్వాత పాదరక్షలు, ఫర్నీచర్, ఫర్నిషింగ్ 23 శాతం చొప్పున ఎక్కువ అమ్మకాలు జరిగాయి. దుస్తులు 22 శాతం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 17 శాతం పెరిగాయి. ఆభరణాల అమ్మకాలు 15 శాతం, ఆహార, కిరాణా సరుకులు 11 శాతం, బ్యూటీ, హెల్త్, పర్సనల్ కేర్ అమ్మకాలు 3 శాతంతో అత్యల్ప వృద్ధిని సాధించాయి. కరోనా ముందు కంటే మెరుగైన వృద్ధి ఉండటంతో దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం సానుకూలంగా ఉంది. ప్రధానంగా దుస్తులు, పాదరక్షల విభాగలు కీలక మద్దతిస్తున్నాయని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు. అమ్మకాల ధోరణి ఇలాగే పండుగ సీజన్‌లోనూ కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed