నవంబర్ 3న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ అత్యవసర సమావేశం!

by Disha Web Desk 17 |
నవంబర్ 3న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ అత్యవసర సమావేశం!
X

ముంబై: ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం వచ్చే నెల 3వ తేదీన అత్యవసరంగా నిర్వహించనున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అనుకున్న లక్ష్యం 6 శాతం కంటే దిగువకు నియంత్రించడంలో విఫలమైనందున, అందుకు ఎదురైన కారణాలను ప్రభుత్వానికి వివరించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం, ఎంపీసీ సమావేశం డిసెంబర్‌ 5-7 తేదీల మధ్య జరగాల్సి ఉంది. చివరిగా సెప్టెంబర్ 28-30 తేదీల్లో ఎంపీసీ సమావేశం జరగ్గా, ద్రవ్యోల్బణ కట్టడికి కీలక రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయంతో రెపో రేటు 5.9 శాతానికి చేరుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నుంచి రుణ రేట్లు పెంపు ధోరణి మొదలవగా, మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ప్రజలు తీసుకునే గృహ రుణాలతో పాటు వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్టం 7.41 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.

కాగా, ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల ఫలితంగా వచ్చే ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగి వస్తుందని ఎంపీసీ సభ్యురాలు ఆశిమా గోయల్‌ ఇటీవల ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed