బొమ్మల విభాగంలో రిలయన్స్ రిటైల్ విస్తరణ!

by Disha Web Desk 17 |
బొమ్మల విభాగంలో రిలయన్స్ రిటైల్ విస్తరణ!
X

న్యూఢిల్లీ: ప్రముఖ రిలయన్స్ రిటైల్ సంస్థ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బొమ్మల రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన బ్రాండ్ రోవాన్ ద్వారా సరసమైన బొమ్మలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇప్పటికే కంపెనీ రోవాన్ బ్రాండ్ కింద బొమ్మల డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్‌కు చెందిన మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్‌ను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక ఔట్‌లెట్ స్టోర్‌లో కేవలం రోవాన్ బ్రాండ్ బొమ్మలు మాత్రమే కాకుండా ఇతర తక్కువ ధరల టాయ్స్ బ్రాండ్లను కూడా విక్రయించనున్న ట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

రిలయన్స్ రిటైల్ వద్ద దిగ్గజ బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హామ్లీస్ కూడా కలిగి ఉంది. హామ్లీస్ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బొమ్మల రిటైల్ కంపెనీ. దీన్ని 2019లో రిలయన్స్ కొనుగోలు చేసింది. కొత్తగా ప్రారంభించిన రోవాన్ స్టోర్లలో రాయితీలతో పాటు, అన్ని రకాల ఉత్పత్తులు తక్కువ ధరలో లభిస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

'రోవాన్ బ్రాండ్ స్టోర్లు చిన్న సైజులో ఉంటాయి. తక్కువ ధరలో వినియోగదారులకు బొమ్మల ఉత్పత్తులు లభిస్తాయి. రానున్న రోజుల్లో మరిన్ని స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ రిటైల్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ గౌరవ్ జైన్ అన్నారు. కాగా, పరిశ్రమల సంఘం ఫిక్కీ, కేపీఎంజీ సంయుక్త నివేదిక ప్రకారం, దేశీయ బొమ్మల మార్కెట్ 2019-20లో సుమారు రూ. 8,250 కోట్లు ఉండగా, ఇది 2024-25 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా వేసింది.



Next Story

Most Viewed