ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం చిన్న స్టోర్లను ప్రారంభించనున్న రిలయన్స్ రిటైల్!

by Disha Web Desk 17 |
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం చిన్న స్టోర్లను ప్రారంభించనున్న రిలయన్స్ రిటైల్!
X

న్యూఢిల్లీ: రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ తన ఎలక్ట్రానిక్స్ చెయిన్ విభాగం రిలయన్స్ డిజిటల్ ద్వారా దేశవ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో చిన్న సైజు దుకాణాలను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రధానంగా ఈ చిన్న స్టోర్లలో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, గేమింగ్ పరికరాలు, టీవీలు, ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులను విక్రయించనున్నట్టు పరిశ్రమకు చెందిన అధికారులు తెలిపారు. ఈ కొత్త స్టోర్లకు అనువైన బ్రాండ్ పేరును రిలయన్స్ రిటైల్ ఇంకా నిర్ణయించలేదని వారు పేర్కోన్నారు.

ఇదివరకు రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద చిన్న స్టోర్లను నిర్వహించింది. అయితే, ఆ తర్వాత కాలంలో వీటిని మూసివేసి, జియో కనెక్షన్లు, కొన్ని మొబైల్‌ఫోన్‌లను విక్రయించేందుకు మై జియో స్టోర్లుగా మార్చేసింది. కొత్తగా ప్రారంభించబోయే చిన్న స్టోర్లు డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్ల కంటే పెద్దగా ఉండనున్నాయని, ఎక్కువ రకాల ఉత్పత్తులను వినియోగదారులకు లభించే స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే త్రైమాసికంలో నగరాలు, చిన్న పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 5జీ ఎనేబుల్ ఉత్పత్తులతో పాటు ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరాలను స్టోర్లలో అందుబాటులోకి తీసుకురానున్నారని ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. దీనికి సంబంధించి రిలయన్స్ రిటైల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.



Next Story

Most Viewed