రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఒప్పందం ఖరారు

by Dishanational1 |
రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఒప్పందం ఖరారు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్నాళ్ల నుంచి చర్చలో ఉన్న రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ బుధవారం తమ మీడియా టీవీ, స్ట్రీమింగ్ ఆస్తుల విలీనాన్ని ప్రకటించాయి. జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఒప్పందాలపై సంతకం చేసినట్టు రిలయన్స్ బుధవారం ప్రకటించింది. లావాదేవీలో భాగంగా, వయాకామ్ 18 మీడియా సంస్థను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేయనున్నారు. విలీన సంస్థ విలువ సుమారు రూ. 70,352 కోట్లు. రిలయన్స్ సంస్థ జాయింట్ వెంచర్‌లో రూ. 11,500 కోట్లు (1.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. విలీన సంస్థలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలు 63 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటాయని, డిస్నీకి 37 శాతం వాటా ఉంటుందని కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.


రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విలీన సంస్థ బోర్డుకు అధ్యక్షత వహిస్తారని, డిస్నీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్‌గా వ్యవహరిస్తారని రిలయన్స్ స్పష్టం చేసింది. విలీన సంస్థ భారత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్‌లో లీడింగ్ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా అవతరించనుంది. దేశంలో 75 కోట్లకు పైగా వీక్షకులను కలిగి ఉంటుంది. స్టార్‌ ఇండియాకు చెందిన 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్‌ ఛానళ్లను విలీనం సంస్థ కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది అని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తం గ్రూప్‌గా ఉన్న డిస్నీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు సంతోషంగా ఉంది. ఈ ఒప్పందంతో దేశీయ వీక్షకులకు తక్కువ ధరలో కంటెంట్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed