కెనరా బ్యాంకుకు రూ. 2.92 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ!

by Disha Web Desk 17 |
కెనరా బ్యాంకుకు రూ. 2.92 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ!
X

ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు పలు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హుల పొదుపు ఖాతాలు తెరవడం వంటి నిబంధనలను బ్యాంకు ఉల్లంఘించినందుకు రూ. 2.92 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

2021, మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్‌బీఐ పరిశీలన తర్వాత ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈకి ఇచ్చే రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో కెనరా బ్యాంకు విఫలమైంది. 2020-21లో మంజూరు, రెన్యువల్ చేసిన ఫ్లోటింగ్ రేటు రుణాలపై వడ్డీని ఎంసీఎల్ఆర్తో లింక్ చేయడంలో విఫలమైనట్టు ఆర్‌బీఐ కనుగొన్నది. అంతేకాకుండా అర్హత లేని సంస్థల పేరుతో సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లను తెరిచిందని, పలు క్రెడిట్ కార్డు ఖాతాల్లో నకిలీ మొబైల్ నంబర్‌లను నమోదు చేసిందని ఆర్‌బీఐ వివరించింది.

రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీ చెల్లించడంలో బ్యాంకు విఫలమైందని స్పష్టం చేసింది. అలాగే, కస్టమర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలను బ్యాంకు వసూలు చేసిందని, ఇంకా ఇతర వినియోగదారు ఆధారిత వ్యవహారాల్లో బ్యాంకు విఫలమైనట్టు ఆర్‌బీఐ పేర్కొంది.

Next Story

Most Viewed