రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

by Dishanational2 |
రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించింది. వాటిలో అతిపెద్ద ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మొత్తం ఆదాయంలో దాదాపు సగం వాటాను కలిగి ఉండటం విశేషం. 2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) 2022-23 నాటికి రూ. 1,04,649 కోట్ల లాభాలకు చేరుకోవడం గమనార్హం. ఇది 2021-22లో 12 పీఎస్‌బీలు ఆర్జించిన రూ. 66,539.98 కోట్లతో పోలిస్తే 57 శాతం అధికం. మొత్తం బ్యాంకుల్లో పూణెకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం వృద్ధితో రూ. 2,602 కోట్ల లాభాలను వెల్లడించింది. దాని తర్వాత యూకో బ్యాంకు 100 శాతం పెరుగుదలతో రూ. 1,862 కోట్లను, బ్యాంక్ ఆఫ్ బరోడా 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు, ఎస్‌బీఐ 59 శాతం (రూ. 50,232 కోట్లు), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 26 శాతం(రూ. 1,313 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51 శాతం(రూ. 1,582 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 23 శాతం(రూ. 2,009 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 శాతం(రూ. 4,023 కోట్లు), ఇండియన్ బ్యాంక్ 34 శాతం(రూ. 5,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం(రూ. 8,433 కోట్లు) వృద్ధిని సాధించాయి. కెనరా బ్యాంక్ రూ. 10,604 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మిగిలిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(రూ. 27 శాతం క్షీణత) మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల వృద్ధిని నమోదు చేశాయి. వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులు రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువ లాభాలను నివేదించాయి. అధిక వడ్డీ ఆదాయం, నిరర్ధక ఆస్తుల నిర్వహణలో మెరుగుదల వంటి కారణాలతో పీఎస్‌బీల లాభాలు పెరిగాయని విశ్లేషకులు వెల్లడించారు.


Next Story

Most Viewed