ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు

by Disha Web Desk 17 |
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌ కూడా ఇరాన్‌పైకి దాడి చేయాలని నిర్ణయించుకోగా మిడిల్‌ఈస్ట్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దీని ఎఫెక్ట్ ముడి చమరుపై పడింది. మంగళవారం(ఏప్రిల్ 16)నాడు ముడి చమురు ధరలు బెంచ్‌మార్క్ బ్రెంట్ బ్యారెల్‌కు $90.57 వద్ద పెరిగింది, ఇది మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే 0.52 శాతం పెరిగింది. దాడి కారణంగా ముడి చమురు ధరలు మరింత పైకి పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

చాలా దేశాలు మధ్యప్రాచ్యం నుంచి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు ఆసియా-పసిఫిక్ ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటుండగా, ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు సవాలుగా మారాయి.

ఈ ఉద్రిక్తతలు వలన ఒక్క ముడి చమురు ధరలు పెరగడమే కాకుండా సరుకు రవాణా కూడా ప్రభావితమవుతుంది. ఇప్పటికే హౌతీ దాడుల కారణంగా ప్రముఖ సరకు రవాణా కంపెనీలు సురక్షితమైన సుదీర్ఘమైన మార్గాలను అనుసరిస్తున్నందున భారతీయ సంస్థలకు షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో వివాదం పెరిగితే చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరగవచ్చని మూడీస్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ముడి చమురు ధరలు 16 శాతం లాభపడి ఇప్పుడు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


Next Story

Most Viewed