దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలు లేకుండా చేయడమే లక్ష్యం: గడ్కరీ

by Dishanational1 |
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలు లేకుండా చేయడమే లక్ష్యం: గడ్కరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ను హరిత ఆర్థికవ్యవస్థగా మార్చాలనే ఆశయంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో ఉన్న 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి దేశాన్ని విముక్తం చేయాలని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీ సోమవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంధన దిగుమతులపై భారత్ ఏటా రూ. 16 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఈ డబ్బును రైతుల జీవితాల మెరుగుదలకు వినియోగిస్తామని, తద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి వివరించారు.

హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపామని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనాలప వినియోగదాన్ని పెంచడం ద్వారా దేశ ఇంధన దిగుమతి నుంచి బయటపడగలమనే విశ్వాసం ఉంది. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రయత్నిస్తున్నానని, వచ్చే 5-7 ఏళ్లలో పరిస్థితులు మారతాయనే నమ్మకం తనకుందన్నారు. ఇది పూర్తిగా జరిగేందుకు నిర్ధిష్ట తేదీ, సంవత్సరం చెప్పలేను. ఇది ఎంతో కష్టమైన పనే అయినప్పటికీ అసాధ్యం కాదని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి వేగాన్ని బట్టి రానున్న కాలంలో ప్రత్యామ్నాయ వాహనాల కల నెరవేరుతుందనే నమ్మకం పెరిగింది. బజాజ్, టీవీఎస్, హీరో లాంటి కంపెనీలు ఫ్లెక్స్ ఇంజన్‌లతో కూడిన మోటార్‌సైకిళ్ల తయారీపై పనిచేస్తున్నాయి. అదే టెక్నాలజీతో ఆటో రిక్షాలు కూడా తయారు కానున్నాయి. తాను కూడా హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నాను. టాటా, అశోక్ లేలండ్ కంపెనీలు హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను తీసుకొచ్చాయి. ఈ మార్పులన్నీ గమనిస్తే త్వరలో భారత ఇంధన దిగుమతులు ఉండవని అనిపిస్తోందని గడ్కరీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed