ఎట్టకేలకు 'జిమ్నీ' కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!

by Disha Web Desk 17 |
ఎట్టకేలకు జిమ్నీ కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి దేశీయ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ జిమ్నీ మోడల్ కారును విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ కారు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు.

బేస్‌లైన్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ ధర రూ. 12.74 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ. 15.05 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించగా, 30 వేలకు పైన ఆర్డర్లు వచ్చాయి. జూన్ మూడో వారం నుంచి కార్లను డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

జిమ్నీ జీటా, ఆల్ఫా వంటి రెండు ట్రిమ్‌లలో లభిస్తుందని, రెండూ ప్రామాణిక 4 డబ్ల్యూడీ సాంకేతికతను కలిగి ఉన్నాయి. 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే జిమ్నీ 5-స్పీడ్ మాన్యూవల్, 4స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. మాన్యూవల్ వెర్షన్ లీటర్‌కు 16.94 కిలోమీటర్లు, ఆటోమెటిక్ లీటర్‌కు 16.39 కిలోమీటర్ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed