రికార్డు స్థాయి డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకి!

by Disha Web Desk 17 |
రికార్డు స్థాయి డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకి!
X

ముంబై: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు అంచనాలకు మించి నమోదవడంతో పెట్టుబడిదారులకు భారీ డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది.

కంపెనీ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఒక్కో షేర్‌కు రూ. 90 అత్యధిక డివిడెండ్ ఇచ్చేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. ఇది 2021-22లో ఇచ్చిన రూ. 60తో పోలిస్తే చాలా ఎక్కువ. దీంతో కంపెనీ మొత్తం డివిడెండ్ చెల్లింపు విలువ రూ. 2,720 కోట్లని మారుతీ సుజుకి పేర్కొంది. డివిడెండ్ చెల్లింపును ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.

కాగా, 2022-23 చివరి త్రైమాసికంలో మారుతీ సుజుకి నికర లాభాలు 43 శాతం వృద్ధితో రూ. 2,623.6 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 20 శాతం పెరిగి రూ. 32,048 కోట్లకు చేరుకుంది. అలాగే, నిర్వహణ లాభం కూడా 38 శాతం ఎక్కువగా రూ. 3,350 కోట్లుగా నమోదైంది. మరోవైపు, దేశీయ వాహన మార్కెట్లో గిరాకీ పెరుగుతున్న దృష్ట్యా కంపెనీ తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్లకు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల కోసం కంపెనీ నిధులను వినియోగిస్తామని పేర్కొంది.



Next Story

Most Viewed