హార్లె-డేవిడ్‌సన్ ప్లాంటులో ఎల్ఎంఎల్ ఈవీ స్కూటర్ల తయారీ!

by Disha Web Desk 16 |
హార్లె-డేవిడ్‌సన్ ప్లాంటులో ఎల్ఎంఎల్ ఈవీ స్కూటర్ల తయారీ!
X

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం వెస్పా స్కూటర్లను విక్రయించిన లోహియా మెషీన్స్ లిమిటెడ్‌ (ఎల్‌ఎంఎల్‌) మరోసారి భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ప్రకటించింది. ఈ నెలాఖరులో మూడు ఈవీలను ఆవిష్కరించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తన ఈవీ స్కూటర్ల కోసం ఎల్ఎంఎల్ కంపెనీ, భారత్‌లో తయారీ నిలిపేసిన హార్లే డేవిడ్‌సన్ మానేసర్ ప్లాంటును ఉపయోగించనుంది.

భారత్‌తో పాటు యూరప్, ప్రపంచ మార్కెట్లే లక్ష్యంగా 2023, మొదటి త్రైమాసికానికి తమ ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తామని ఎస్‌జీ కార్పొరేట్ సీఈఓ యోగేష్ భాటియా అన్నారు. ఈ నెలాఖరులోగా వీటిని ఆవిష్కరించనుంది. హార్లే-డేవిడ్‌సన్ తయారీ ప్లాంటు కోసం జరిగిన ఒప్పందం ద్వారా కంపెనీ ఇప్పటికే అసెంబ్లీ లైన్, రోబోటిక్ మెషీన్‌లతో తయారీ వ్యవస్థను సిద్ధం చేసిందని యోగేశ్ తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎంఎల్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కాగా, 1999లో ఇటలీకి చెందిన పియాజియో, సి స్పాలతో కలిసి వెస్పా స్కూటర్లను తయారు చేసిన ఎల్ఎంఎల్ కంపెనీ, ఆ సమయంలో బజాజ్ చేతక్‌కు గట్టి పోటీనివ్వడంలో విజయవంతమైంది. 2000 ప్రారంభంలో 100సీసీ ద్విచక్ర వాహనాల విభాగంలో వినియోగదారుల ఆదరణ పొందిన ఎల్ఎంఎల్ అమ్మకాలు దెబ్బతినడం, నష్టాల కారణంగా 2018లో మూతపడింది. ఆ తర్వాత పరిణామాల్లో ఎల్ఎంఎల్ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన ఎస్‌జీ కార్పొరేట్ లిమిటెడ్ గతేడాది ఎల్ఎంఎల్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీతో తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదిలో మూడు కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది. కొత్త ఈవీల తయారీ కోసం రూ. 350 కోట్ల పెట్టుబడులను కూడా ప్రకటించింది. అంతేకాకుండా రాబోయే 3-5 ఏళ్లలో మొత్తం రూ. 1,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.

Also Read: ఈ పండుగ సీజన్‌కు 35 శాతం పెరగనున్న గృహోపకరణాల అమ్మకాలు!

Next Story

Most Viewed