ఐటీ పరిశ్రమలో నియామకాలు డౌన్

by Dishanational2 |
ఐటీ పరిశ్రమలో నియామకాలు డౌన్
X

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఐటీ రంగం అత్యంత గడ్డుకాలాన్ని చూస్తోంది. రెండేళ్ల క్రితం కరోనా సమయంలో మిగిలిన రంగాలన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఐటీ రంగం మాత్రం మెరుగ్గా రాణించింది. ఆ సమయంలో ఐటీ ఉద్యోగాలకు భారీగా గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా అనూహ్యంగా పెరిగిన డిజటలీకరణతో ఐటీ సంస్థలు వేలాదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగా కూడా ఐటీ పరిశ్రమ ఉద్యోగాలను తొలగిస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

దీనికి ఆర్థిక మాంద్యం ఆందోళనలతో పాటు పెరిగిన ఖర్చులే కారణమైనప్పటికీ ఐటీ పరిశ్రమ ఉన్న ఉద్యోగులందరికీ జీతాలివ్వలేక ఇంటికి సాగనంపింది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలను సైతం తగ్గించేసిందని ఓ నివేదిక వెల్లడించింది. చిన్న కంపెనీలు మొదలుకొని దిగ్గజ సంస్థల దాకా కొత్త నియామకాల ప్రక్రియను తగ్గించేశాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, దేశీయ దిగ్గజ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలే 2022-23లో మొత్తం 1,900 మందిని నియమించుకున్నాయని చెబుతున్నాయి. ఇది గడిచిన 11 త్రైమాసికాల్లోనే తక్కువ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జాబ్‌సైట్ నౌక్రీ డాట్ కామ్ నివేదిక ప్రకారం భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల వృద్ధి 25 శాతం క్షీణించింది. ముఖ్యంగా దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు యూనికార్న్ కంపెనీల్లో హైరింగ్ సెంటిమెంట్ భారీగా పడిపోయింది. ఐటీ స్టార్టప్‌లలో మాత్రం నియామకాల ధోరణి గతేడాదితో పోలిస్తే స్థిరంగా ఉందని నివేదిక పేర్కొంది.

సీనియర్ల కోసం వేట..

ప్రధానంగా ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను చాలావరకు తగ్గించేశాయి. అలాగే ఓ మోస్తరు అనుభవం ఉన్నవారితో పాటు మధ్యస్థ అనుభవం కలిగిన ఉద్యోగుల నియామకాలను సైతం తగ్గించాయి. సీనియర్ స్థాయి(12 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు) ఉద్యోగుల నియామకాలు మాత్రం స్థిరంగా ఉన్నాయని నివేదిక వివరించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన నియామకాల్లో బీమా, ఆయిల్, హాస్పిటాలిటీ వంటి నాన్-ఐటీ రంగాలు పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టాయని నౌక్రి డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు.

మరికొంత కాలం ఇలాగే..

భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక మాంద్యం ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో చాలా కంపెనీలు 12 ఏళ్ల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ ఉద్యోగుల కోసం వేత మొదలుపెట్టాయి. 2023 ప్రారంభంలో వీరికి డిమాండ్ అత్యధికంగా ఉందని, గతేడాదితో పోలిస్తే 20 శాతం కంటే ఎక్కువ వృద్ధిని ఈ విభాగం నియామకాలు సాధించాయని నివేదిక వెల్లడించింది. గతేడాది ప్రకటనలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్యూల ద్వారా 15-50 వేల మంది వరకు ఫ్రెషర్లను తీసుకుంటామని ప్రకటించాయి. కానీ, ఆర్థిక మాంద్యం, వ్యయ భారతం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల మధ్య ఉన్నవారికి జీతాలివ్వడమే కష్టంగా ఉందని చెబుతున్నాయి. దాంతో ఐటీ పరిశ్రమలో నియామకాల ధోరణి ప్రతికూలంగా ఉండోచ్చని, రాబోయే మరికొన్ని నెలల పాటు పరిస్థితులు ఉండనున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story

Most Viewed