బీమా వ్యాపారంలోకి జియో ఫైనాన్షియల్!

by Disha Web Desk 17 |
బీమా వ్యాపారంలోకి జియో ఫైనాన్షియల్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశీయ బీమా వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే సీనియర్ స్థాయి ఉద్యోగులను నియమించే ప్రక్రియ ప్రారంభించిందని, బీమా వ్యాపార లైసెన్స్ కోసం ఐఆర్‌డీఏని సంప్రదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీమా వ్యాపారంలోకి ప్రవేశించే అంశంపై రానున్న రిలయన్స్ వార్షిక సర్వసభ్య(ఏజీఎం) సమావేశంలో ప్రకటించనుంది. కొందరు మాజీ ప్రభుత్వ రంగ ఉద్యోగులను కంపెనీ ఇప్పటికే నియమించిందని సమాచారం.

ఐసీఐసీఐ గ్రూప్‌లోని కొంతమంది కంపెనీలో చేరతారని భావిస్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జీవిత బీమాతో పాటు సాధారణ బీమా వ్యాపారాలను నిర్వహించనుంది. జియో సంస్థ బీమా వ్యాపారం లోకి రావడం ద్వారా మొత్తం పరిశ్రమలో పోటీ పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భవిష్యత్తులో టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో టెక్నాలజీ కీలకంగా ఉండనుంది. ప్రభుత్వం సైతం బీమా సవరణ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీమా వ్యాపారంలోకి జియో రాకతో ఎల్ఐసీ లాంటి దిగ్గజ సంస్థలు సైతం తమ వ్యాపార వ్యూహంలో మార్పు చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల మధ్య, మంగళవారం రిలయన్స్ సంస్థ షేర్లు దాదాపు 3 శాతం పుంజుకుంది.

Next Story