నష్టాల నుంచి లాభాలకు మారిన సూచీలు

by Dishanational1 |
నష్టాల నుంచి లాభాలకు మారిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో మెరుగైన ర్యాలీని కొనసాగించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఉదయం ప్రారంభంలో నష్టాలను చూసిన సూచీలు ఆ తర్వాత మిడ్-సెషన్ వరకు బలహీనంగానే ర్యాలీ చేశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఇతర గ్లోబల్ పరిణామాలతో నీరసించిన మార్కెట్లకు మధ్యాహ్నం తర్వాత లాభాలు వచ్చాయి. ప్రధాన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాల్లో మదుపర్లు ఆసక్తి చూపడం, ఆఖరి గంటలో కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలు లాభాల్లోకి మారాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 267.64 పాయింట్లు లాభపడి 71,822 వద్ద, నిఫ్టీ 96.80 పాయింట్ల లాభంతో 21,840 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు బలహీనపడినా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.04 వద్ద ఉంది. మిడ్-సెషన్ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.4.14 లక్షల కోట్లు పెరిగి రూ.384.89 లక్షల కోట్లకు చేరుకుంది.

Next Story

Most Viewed