వరుసగా రెండో రోజూ లాభపడ్డ సూచీలు!

by Disha Web Desk 17 |
వరుసగా రెండో రోజూ లాభపడ్డ సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత సూచీలు మెరుగ్గా రాణించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం షేర్లలో పెట్టుబడి దారులు కొనుగోళ్లను పెద్ద ఎత్తున కొనసాగించడంతో స్టాక్ మార్కెట్లు లాభాలను సాధించాయి. గ్లోబల్ మార్కెట్లలో ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల పేలవమైన ఆదాయ వివరాలకు తోడు ఆర్థిక మాంద్యం భయాల కారణంగా ప్రతికూలత ఏర్పడింది.

ఈ ప్రభావంతోనే ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాలను చూశాయి. అయినప్పటికీ భారత మార్కెట్లలో స్థానిక అంశాలు దోహదపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచే సానుకూల ర్యాలీ తర్వాత మిడ్-సెషన్ సమయంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనబడినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్ల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203.01 పాయింట్లు ఎగసి 59,959 వద్ద, నిఫ్టీ 49.85 పాయింట్లు లాభపడి 17,786 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో రంగం మాత్రమే బలపడింది. మెటల్, ఫార్మా, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి సెప్టెంబర్ త్రైమాసికం లాభాల్లో నాలుగు రెట్ల వృద్ధిని ప్రకటించడంతో షేర్ ధర అత్యధికంగా 5 శాతం వరకు పెరిగింది.

దీని తర్వాత రిలయన్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ కంపెనీల షేర్లు అధిక లాభాల్లో ట్రేడయ్యాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.47 వద్ద ఉంది.



Next Story

Most Viewed