ఆఫీస్ స్థలాల లీజులో భారత కంపెనీల దూకుడు!

by Disha Web Desk 17 |
ఆఫీస్ స్థలాల లీజులో భారత కంపెనీల దూకుడు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మొదటి మూడు నెలల్లో దేశీయ కంపెనీలు ఆఫీస్ స్థలాల లీజింగ్ విషయంలో అమెరికా కంపెనీలను అధిగమించాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా తాజా నివేదిక ప్రకారం, 2023, మొదటి త్రైమాసికంలో దాదాపు 50 శాతం వాటాతో దేశీయ కంపెనీలు, ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ని కలిగి ఉన్నాయి. దేశంలోని ప్రధాన తొమ్మిది నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతేడాది కంటే 9 శాతం పెరిగి 1.16 కోట్ల చదపు అడుగులకు చేరుకుంది.

2022 ఏడాది మొత్తానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ 40 శాతం పెరిగి 5.66 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. అందులో దేశీయ కంపెనీల వాటా 2.77 కోట్ల చదరపు అడుగులు కాగా, 2.03 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.

నివేదిక ప్రకారం, మొత్తం లీజింగ్‌లో టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు 22 శాతంతో అధిక ఆఫీస్ స్థలాలను కలిగి ఉన్నాయి. వీటి తర్వాత ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు(11 శాతం), రీసెర్చ్, కన్సల్టింగ్, అనలిటిక్ సంస్థలు(10శాతం) స్థలాలను లీజు తీసుకున్నాయి.

కఠిన పాలసీ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ఆఫీస్ స్థలాల మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని, రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మరింత వృద్ధి సాధిస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈఓ అన్షుమాన్ మ్యాగజైన్ చెప్పారు. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో డిమాండ్ సానుకూలంగా ఉన్నందున జనవరి-మార్చి మధ్య 14 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్నాయని నివేదిక పేర్కొంది.

Next Story

Most Viewed