ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ప్రోత్సాహకాలు!

by Disha Web Desk 17 |
ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ప్రోత్సాహకాలు!
X

న్యూఢిల్లీ: తయారీ రంగంలో చైనాను సవాలు చేసేందుకు భారత్ కీలక చర్యలు తీసుకోనుంది. దిగుమతులను తగ్గించి, దీర్ఘకాలంలో దేశాన్ని ఎగుమతుల కేంద్రంగా మార్చేందుకు టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుకుంటోంది. ఇందులో భాగంగా గ్లోబల్ దిగ్గజ యాపిల్‌తో పాటు హెచ్‌పీ, డెల్ టెక్నాలజీస్, ఆసుస్‌టెక్ వంటి కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ పథకాల ద్వారా మద్దతిస్తున్నప్పటికీ, దేశీయంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ల వంటి ఉత్పత్తుల తయారీ కోసం ఈ కంపెనీలకు ప్రయోజనాలు అందించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమల్లో ఉన్న వారి నుంచి అభిప్రాయ సేకరణ కోసం వివరాలు పంపినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా తైవాన్ సరఫరాదారుల నుంచి భారత్‌లో ఇప్పటికే ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్న యాపిల్‌ను స్థానికంగానే ఐప్యాడ్‌ల తయారీకి ఒప్పించాలనుకుంటోంది. సంబంధిత వర్గాల ప్రకారం, ప్రభుత్వం చర్యలు అమలైతే ఒక్కో కంపెనీకి రూ. 45 వేల కోట్ల వరకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

ఇదే సమయంలో విదేశీ కంపెనీలకు అందించే ఈ ప్రోత్సాహకాలను కొన్ని షరతులతో ఇవ్వనుంది. ఇందులో రాబోయే ఐదేళ్ల సమయంలో కనీసం రూ. 57 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళికను కంపెనీలు ప్రకటించాల్సి ఉండొచ్చు. అదేవిధంగా కంపెనీలు స్థానిక విడిభాగాలను కొనే దాన్ని బట్టి ప్రోత్సహకాలు ఉండనున్నాయి.

కాగా, గతేడాదిలోనే ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల తయారీ కోసం రూ. 73,500 కోట్ల పీఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు తక్కువగా భావించి కంపెనీలు రాకపోవడంతో ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాలని భావిస్తోంది.


Next Story

Most Viewed