మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు

by Dishanational1 |
మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు మరింత భారం కానున్నాయి. తాజాగా బ్యాంకు ఎంపిక చేసిన కాలవ్యవధులపై రుణాల బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన కొత్త వడ్డీ రేట్లు గురువారం(ఫిబ్రవరి 8) నుంచి అమల్లోకి రానున్నాయి. దాంతో బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేట్లు 8.90 శాతం నుంచి 9.35 శాతం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో 8.90 శాతానికి పెరిగింది. అలాగే, నెలరోజుల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి సవరిస్తూ బ్యాంకు నిర్ణయించింది. వినియోగదారులు తీసుకునే వాహన, గృహ రుణాలకు సంబంధించిన ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 9.25 శాతం నుంచి 9.30 శాతానికి పెంచింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక‌ రుణ రేటు. నిధుల సేక‌ర‌ణ‌కు బ్యాంకుల‌కు అయ్యే (మార్జిన‌ల్) ఖర్చు, నిర్వ‌హ‌ణ వ్య‌యం, క్యాష్ రిజ‌ర్వ్ రేషియో (సీఆర్ఆర్‌), కాల‌ప‌రిమితి ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాబ‌ట్టి, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు రుణం అందించే అవ‌కాశం ఉండ‌దు. కాబట్టి ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.


Next Story

Most Viewed