మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం

by Disha Web Desk 17 |
మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి రూ. 1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 1.87 లక్షల కోట్లు, ఆ తర్వాత అక్టోబర్‌లో నమోదైన రూ. 1.72 లక్షల కోట్లు అత్యధికం కాగా, తాజా వసూళ్లు మూడో అత్యధికంగా నమోదయ్యాయి.

ఇది ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు ఆరవసారి రూ. 1.60 లక్షల కోట్ల మార్కును దాటాయి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,67,929 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. అందులో సీజీఎస్టీ రూ. 30,420 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 38,226 కోట్లు, ఐజీఎస్టీ రూ. 87,009 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 39,198 కోట్లతో కలిపి), సెస్ రూ. 12,274 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 1,036 కోట్లతో కలిపి) వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల రెండంకెల వృద్ధి..

ఇక, వస్తు, సేవల పన్ను ఆదాయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించాయి. తెలంగాణలో గత నెల జీఎస్టీ వసూళ్లు రూ. 4,986 కోట్లతో 18 శాతం పెరిగాయి. గతేడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ. 4,228 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల రూ. 4,093 కోట్లు రాగా, ఇది గతేడాది అక్టోబర్లో వచ్చిన రూ.3,1347 కోట్ల కంటే 31 శాతం ఎక్కువని మంత్రిత్వ శాఖ వివరించింది.Next Story

Most Viewed