త్వరలో వాహనాలకు కొత్త నిబంధనలు: నితిన్ గడ్కరీ!

by Web Desk |
త్వరలో వాహనాలకు కొత్త నిబంధనలు: నితిన్ గడ్కరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా మార్కెట్లోకి రావడానికి ముందు వాహనాల భద్రతను తనిఖీ చేసే గ్లోబల్ రేటింగ్ కంపెనీల నిబంధనలకు అనుగుణంగా రేటింగ్ ఇచ్చే న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌సీఏపీ) వ్యవస్థను ప్రభుత్వం రూపొందించనుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ ప్రకటనలో వాహనాల భద్రతకు సంబంధించి నాణ్యతను నిర్ధారించే స్టార్ట్ రేటింగ్ కేటాయించే విధానం వస్తుందన్నారు. అలాగే, అన్ని రకాల ప్యాసింజర్ వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటోమొబైల్ తయారీదారులు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), కారులో ముందు ఉండే ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్‌లను కూడా తప్పనిసరి చేయనున్నామని, కారు వెనుక సిటింగ్‌లో మధ్య సీటుకు కూడా ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్టు విలేకరుల సమావేశంలో గడ్కరీ స్పష్టం చేశారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ద్వారా దేశీయంగా ఎయిర్‌బ్యాగుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, దీనివల్ల ధరల భారం ఉండదని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా దాదాపు 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీన్ని 2025 నాటికి 50 శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాల మూలంగా దేశ జీడీపీకి 3.1 శాతం నష్టం ఏర్పడుతోందని వెల్లడించారు.

Next Story

Most Viewed