మే 1 నుంచి జూన్ 30 వరకు పనిచేయనున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు

by Disha Web Desk 17 |
మే 1 నుంచి జూన్ 30 వరకు పనిచేయనున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎండ వేడి ప్రభావంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరగడంతో దేశంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడటానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు తమ ప్లాంట్లను మే 1 నుండి జూన్ 30 వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ నుండి జూన్ 2024 మధ్య కాలంలో 260 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీంతో సప్లై పరంగా వేసవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి గ్యాస్-బేస్డ్ జనరేటింగ్ స్టేషన్‌లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, మే 1, 2024 నుండి జూన్ 30, 2024 వరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం ఈ ఆర్డర్ చెల్లుబాటులో ఉంటుంది. విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 11 ప్రకారం అన్ని గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాలకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం, ఉత్పాదక స్టేషన్‌లు పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ప్లాంట్లు ఎన్ని రోజులకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం ముందస్తు సమాచారం అందిస్తుంది. అలాగే అవి తమ నిర్వహణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించాల్సి ఉంటుంది.

గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తిని సమీక్ష చేయడానికి వీలుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్‌పర్సన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాఖ (IMD) 2024 వేసవిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 243 గిగావాట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed